ఫాసిజానికి వ్యతిరేకంగా సంఘటితంగా పోరాడాలి
లక్ష్మీపురం (గుంటూరు వెస్ట్): దేశంలో గత 11 సంవత్సరాలుగా ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో ఫాసిజం ప్రమాదకర స్థాయికి చేరిందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యా పరిరక్షణ కమిటీ కన్వీనర్, అఖిల భారత విద్యా హక్కుల వేదిక ఉపాధ్యక్షులు డి.రమేష్ పట్నాయక్ అన్నారు. గుంటూరు కొత్తపేటలోని జిల్లా సీపీఐ కార్యాలంయలో శుక్రవారం ఆల్ ఇండియా దళిత రైట్స్ మూమెంట్ (ఏఐడీఆర్‌ఎం)– దళిత హక్కుల పోరాట సమితి (డీహెచ్పీఎస్) జాతీయ సమితి సమావేశాలు ప్రారంభమయ్యాయి. రాష్ట్ర అధ్యక్షులు జేవీ ప్రభాకర్ సభకు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫాసిజం వచ్చిన తర్వాత దాన్ని ఎదుర్కోవడం అసాధ్యమని, అది రాకముందే అడ్డుకోవడమే ఏకై క మార్గమని ఆయన స్పష్టం చేశారు. బీజేపీని ఎన్నికల్లో ఒంటరిగా చేసి ఓడించడమే కాకుండా, రోజువారీ సామాజిక జీవితంలోనూ బీజేపీ–ఆర్‌ఎస్‌ఎస్ భావజాలానికి వ్యతిరేకంగా నిరంతర పోరాటం సాగాలని పిలుపునిచ్చారు. ఎస్.వి యూనివర్సిటీ పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్ బి.వి.మురళీధర్ మాట్లాడుతూ వైవిధ్యభరిత సమాజంలో ఒకే ధర్మాన్ని ఆధారంగా తీసుకొని ప్రభుత్వం లేదా వ్యవస్థను ఏర్పాటు చేయడం ప్రమాదకరమని అన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వర య్య మాట్లాడుతూ దళితులు, గిరిజనులు, పేద వర్గాల ప్రజలను భక్తి పేరుతో, వివిధ రూపాలలో దోపిడీ చేస్తున్న పరిస్థితులు నెలకొన్నాయన్నారు. సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు ముప్పాళ్ళ నాగేశ్వరరావు, ఏఐడిఆర్‌ఎం జాతీయ ప్రధాన కార్యదర్శి వి.ఎస్. నిర్మల్, ఏఐడీఆర్‌ఎం జాతీయ అధ్యక్షులు రామమూర్తి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జంగాల అజయ్‌కుమార్, సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సీహెచ్ కోటేశ్వరరావు, బీకేఎంయూ జాతీయ నాయకులు గుల్జార్ సింగ్ గోరియా, జానకీపాశ్వన్ తదితరులు మాట్లాడారు. గుంటూరు జిల్లా సీపీఐ కార్యదర్శి కోట మాల్యాద్రి, నగర కార్యదర్శి ఆకిటి అరుణ్ కుమార్, తెలంగాణ డీహెచ్పీఎస్ అధ్యక్ష కార్యదర్శులు ఏసురత్నం, అనిల్ కుమార్, బిహార్, ఉత్తరప్రదేశ్, తమిళనాడు, పాండిచ్చేరి, గుజరాత్ తదితర రాష్ట్రాల డీహెచ్పీఎస్ బాధ్యులు, తదితరులు పాల్గొన్నారు.
గుంటూరులో ప్రారంభమైన ఆల్ ఇండియా దళిత రైట్స్ మూమెంట్ జాతీయ సమావేశాలు


