ఇష్టపడే పనిని కష్టపడి చేస్తే నష్టపోయేది లేదు
మంగళగిరి టౌన్ : ప్రతి ఒక్కరు తమ జీవితంలో వారు ఇష్టపడే పనిని కష్టపడి చేస్తే నష్టపోయేది లేదని విజయం సాధిస్తారని భారత మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. చినకాకానిలోని ఎన్‌ఆర్‌ఐ మెడికల్ కాలేజీ, జనరల్ హాస్పిటల్‌లో శుక్రవారం నూతన క్యాథల్యాబ్‌ను కై కలూరు ఎమ్మెల్యే శ్రీనివాసరావుతో కలసి ఆయన ప్రారంభించారు. కళాశాల ప్రాంగణంలో మొక్కలు నాటి నూతనంగా నిర్మించబోయే ఆడిటోరియం భవనానికి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.
● ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ అన్ని ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో పూర్తి సౌకర్యాలు కల్పించేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని తెలిపారు. మారుతున్న జీవనశైలి కారణంగా వస్తున్న కొత్త వ్యాధులను ఎదుర్కోవడానికి వైద్యవిద్యార్థులు నిరంతరం అప్‌డేట్ కావాలని సూచించారు. టెక్నాలజీ పెరుగుతున్న కొలది సామాన్యుడికి తక్కువ ఖర్చుతో మెరుగైన వైద్యం అందేలా చూడాలని కోరారు. వైద్యులు రోగులకు న్యాయమైన విధంగా సేవ చేయాలని, రోగులు చెప్పేది పూర్తిగా విని అవసరమైతేనే సంబంధిత వైద్యపరీక్షలు రాయాలని సూచించారు. ఈ మధ్యకాలంలో కొందరు వైద్యుల తీరు పలుకే బంగారమాయేలే అన్న చందంగా మారిందని రోగులతో, వారి సహాయకులతో తెలుగులో మాట్లాడి వారికి అర్థమయ్యే రీతిలో వివరించాలని వైద్యులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో ఎన్‌ఆర్‌ఐ అడ్మినిస్ట్రేటర్ విష్ణువర్ధనరావు, డీన్ డాక్టర్ లక్ష్మి, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాసరావు, పలువురు అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు


