కన్నా అనుచరుడి అరాచకం
వడ్డెరల క్వారీకి అడ్డు పడుతున్న వైనం మంత్రిని కలిసినా ఉపయోగం లేకుండా పోయింది... కన్నాతో చెప్పించండి అంటూ మంత్రి కొల్లు ఉచిత సలహా
మంత్రి కొల్లును కలసిన వడ్డెర సంఘం నేత
సాక్షి ప్రతినిధి, గుంటూరు: గుంటూరు రూరల్ మండలంలో సత్తెనపల్లి శాసనసభ్యుడు, మాజీ మంత్రి కన్నా అనుచరుడు, పీవీఆర్ చలపతి మెటల్ ఇండస్ట్రీస్ అధినేత పి వెంకటేశ్వరరావు అరాచకాలకు అడ్డు లేకుండా పోయిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. చంద్రబాబునాయుడి ప్రభుత్వం వచ్చిన తర్వాత పలకలూరులోని క్వారీలలో అనుమతులు ఉన్న ఎవరిని తవ్వనీయకుండా తానే ఏకచత్రాధిపత్యంగా వ్యవహరిస్తున్నాడని మిగిలిన క్వారీ యజమానులు ఆరోపిస్తున్నారు. క్వారీకి వెళ్లే దారిని తవ్వేయడంతోపాటు మిగిలిన క్వారీ యజమానులను బెదిరిస్తున్నాడని, ఆయనకు మాజీ మంత్రి అండదండలు ఉండటంతో పార్టీ నాయకులు కూడా ఏం చేయలేని స్థితిలో ఉన్నట్లు చెబుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 11 క్వారీలు ఉన్నా పక్కన ఉన్న క్వారీలపై కన్నేసిన ఆ నాయకుడు మిగిలిన క్వారీల వారికి దారి లేకుండా చేస్తున్నాడు. స్థానికంగా ఉన్న క్వారీ యజమానులు మొరపెట్టుకున్నా అధికారులు కూడా ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నారు. తాజాగా మేడికొండూరు మండలం పేరేచర్ల గ్రామానికి చెందిన పేరేచర్ల తెల్ల క్వారీ వడ్డెర క్వారీ వర్కర్స్ లేబర్ కాంట్రాక్టర్ కో–ఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్‌కు గుంటూరు రూరల్ మండలం చినపలకలూరు గ్రామంలో సర్వే నెంబర్ 155/ఎ1లో 1.214 హెక్టార్ల క్వారీ లీజు ఉంది. దీన్ని 13 నెలలుగా జరగనీయకుండా సదరు నాయకుడు అడ్డు పడుతున్నాడు. తనకు కేటాయించిన స్థలంతోపాటు వడ్డెర క్వారీలో కూడా అనుమతులు కూడా లేకుండా తవ్వడంపై ఆ వడ్డెర క్వారీ వారు ఫిర్యాదు చేయడంతో అధికారులు షోకాజ్ నోటీసు జారీ చేశారు. బాధితులు ఇబ్రహీంపట్నం రాష్ట్ర మైనింగ్ కార్యాలయం వద్ద ధర్నాకు దిగారు. దీంతో ఉన్నతాధికారులు స్పందించి ఒంగోలు మైనింగ్ అఽధికారితో విచారణ జరిపించారు. ఆయన పరిశీలన చేసి ఇరువర్గాలతో మాట్లాడిన తర్వాత గత ఏడాది నవంబర్ 26న మైనింగ్ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. దీనిపై మంత్రి వద్దకు వెళ్లిన సదరు నేత స్టే తీసుకువచ్చారు.
కేంద్ర మంత్రి కార్యాలయంలో
పంచాయితీ
ఇటీవల కాలంలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కార్యాలయంలో కూడా పంచాయితీ జరిగింది. ఇరువర్గాల మధ్య సయోధ్య కుదిర్చారు. అయితే బయటకు రాగానే సదరు నాయకుడు అడ్డం తిరిగాడు. క్వారీకి వెళ్లే దారిని పొక్లెయిన్‌తో తవ్వేయడంతో మిగిలిన క్వారీలకు దారి లేకుండా పోయింది. దీంతో 13 నెలలుగా 50 వడ్డెర కుటుంబాలకు ఉపాధి లేకుండా పోయింది. గతంలో కూడా ఇలానే అడ్డుకుంటే గత ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకువెళ్లడంతో వారి ఆదేశాల మేరకు క్వారీలు సవ్యంగా నడిచాయి. మళ్లీ చంద్రబాబు నాయుడి ప్రభుత్వం వచ్చిన తర్వాత దారి తవ్వేయడంతో పాటు ఆ క్వారీ వారు ఎవరూ రాకుండా తన మనుషులతో అడ్డుకుంటున్నాడు.
తాజాగా శుక్రవారం వడ్డెర క్వారీ నిర్వాహకులతోపాటు వడ్డెర ప్రజాగళం రాష్ట్ర అధ్యక్షులు ఇడగొట్టు నాగేశ్వరరావు మంత్రి కొల్లు రవీంద్రను కలిశారు. మంత్రి వారి వద్ద ఉన్న కాగితాలు పరిశీలించిన తర్వాత స్థానిక ఎమ్మెల్యే వద్ద నుంచి లేఖ తెచ్చుకోవాలని సూచించా రు. స్థానిక ఎమ్మెల్యే నుంచి కూడా లేఖ తెచ్చామని వారు చూపించగా సత్తెనపల్లి శాసనసభ్యుడు కన్నా లక్ష్మీనారాయణను కలవాలని సలహా ఇచ్చారు. దీనిపై వడ్డెర క్వారీ నిర్వాహకులు ఇక్కడ ఆయనకేం పని అని ప్రశ్నించారు. తాము పార్టీ నాయకులతో సమావేశం ఏర్పాటు చేసుకుని చర్చించిన తర్వాత దీనిపై నిర్ణయం తీసుకుంటామని మంత్రి చెప్పారని నాగేశ్వరరావు తెలిపారు. తమ క్వారీ నిర్వహణకు పార్టీ నాయకులతో పనేంటని ఆయన ప్రశ్నించారు. ఈ ధోరణి మారకపోతే పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తామని ఆయన సాక్షికి తెలిపారు.
కన్నా అనుచరుడి అరాచకం


