తుక్కు తరలింపులో మెక్కేస్తున్నారు
తూకాల్లో తేడాతో లబ్ధి పొందుతున్న ఆసుపత్రి సిబ్బంది పర్యవేక్షణ లేకుండా తుక్కు సామగ్రి తరలింపు ఆక్సిజన్ కొనుగోలులో తేలని లెక్కలు
వేయింగ్ మిషన్‌లో మతలబు
ఆసుపత్రిలో వినియోగంలో లేని, పనికి రాని మంచాలు, సైలెన్ స్టాండ్లు, బీరువాలు, సర్జకల్ ట్రేలు, ఇతర వైద్య పరికరాలు వర్క్‌షాపు ద్వారా టెండర్లు పిలిచి తుక్కుగా మార్చి అమ్మేస్తుంటారు.
గత ఏడాది టెండరు పాడుకున్న ఓ వ్యక్తి కిలో రూ.30లు వెచ్చించి ఇనుము కొనుగోలు చేస్తున్నాడు. అయితే ఆసుపత్రి పరిపాలనా అధికారి, కార్యాలయ ఉద్యోగి తప్పనిసరిగా వేయింగ్ మిషన్ వద్దకు వెళ్లి దగ్గరుండి తూకం వేయించి సదరు వివరాలు బుక్‌లో రాసి, తుక్కును కాంట్రాక్టర్‌కు అప్పగించాల్సి ఉంటుంది.
ఆసుపత్రిలో ఈ తరహాలో తుక్కు తరలింపు జరగడం లేదు. వేయింగ్ మిషన్‌లకు అనుమతులు లేని, ఇష్టానుసారం బిల్లులు ఇచ్చేవారి వద్ద తూకం వేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
గుంటూరు మెడికల్: రౌతు మెతకనైతే గుర్రం మూడుకాళ్ల మీద నడిచిందన్న చందాన గుంటూరు పెద్దాసుపత్రి(జీజీహెచ్)లో అధికారుల పరిపాలన సాగుతోంది. కొంత మంది సిబ్బంది, కొంత మంది అధికారులతో మిలాఖతై ప్రతిదాంట్లో అందిన కాడికి నొక్కేసి జేబులు నింపుకుంటున్నారు. బుధవారం రాత్రి ఎవరి కంట పడకుండా హడావుడిగా ఆసుపత్రిలోని తుక్కును తరలించి వారికి నచ్చినచోట తూకాలు వేయించి, అందిన కాడికి జేబుల్లో పెట్టేసుకున్నారు.
తాజాగా బుధవారం రాత్రి జరిపిన అమ్మకాలకు సంబంధించి డబ్బు సైతం కాంట్రాక్టర్ పూర్తి స్థాయిలో హెచ్‌డీఎస్ (ఆసుపత్రి అభివృద్ధి సంఘం) అకౌంట్‌కు జమ చేయలేదు. అయినప్పటికీ యథేచ్ఛగా తుక్కును తీసుకెళ్లేందుకు అనుమతులు మంజూరు చేయడం విమర్శలకు తావిస్తుంది. పరిపాలనా అధికారి పనితీరు బాగోకపోవడంతో రెండు నెలల క్రితం సరెండర్ చేశారు. సదరు బాధ్యతలు ఎవరు నిర్వర్తిస్తున్నారో ఎవరికి తెలియదు. తుక్కు తరలింపులో ఏవో, వర్క్‌షాపు ఉద్యోగుల పాత్ర కీలకం. వీరివురు లేకుండా మరో అధికారి స్వయంగా తనకు నచ్చిన వేయింగ్ మిషన్ సెంటర్‌కు తుక్కు లారీని తరలించినట్లు ఆసుపత్రి ఉద్యోగులు చెవులు కొర్కుంటున్నారు.
తుక్కు తరలింపులో మెక్కేస్తున్నారు


