పోలీసుల తనిఖీల్లో భారీగా సొత్తు స్వాధీనం
అతి పురాతన, విలువైన విగ్రహాలు ఉన్నాయని జిల్లా ఎస్పీకి సమాచారం రావడంతో తనిఖీలు సుమారు రూ.1.35 కోట్ల సొత్తు స్వాధీనం
తెనాలిరూరల్: పోలీసులు చేపట్టిన ఆకస్మిక తనిఖీల్లో భారీ ఎత్తున సొత్తు లభించింది. గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్‌కు వచ్చిన సమాచారంతో తెనాలి పట్టణ బాలాజీరావుపేట మహేంద్ర కాలనీలో గుంటూరు నుంచి వచ్చిన టాస్క్‌ఫోర్స్ పోలీసులు, ఇక్కడి త్రీ టౌన్ పోలీసులతో కలసి శుక్రవారం తెల్లవారుజామున నాలుగు ఇళ్లలో ఏకధాటిగా నాలుగు బృందాలుగా తనిఖీలు నిర్వహించారు. ఓ రేకుల షెడ్డులో నివసిస్తున్న పేరుబోయిన గురవమ్మ వద్ద 700 గ్రాముల బంగారం, 15 కిలోల వెండి, రూ.5.60 లక్షల వరకు నగదు లభించింది. మహేంద్ర కాలనీలోని ఓ ఇంట్లో అతి విలువైన పురాతన దేవతా విగ్రహాలు, పురాతన విగ్రహాలు ఉన్నట్టు ఎస్పీకి వచ్చిన సమాచారంతో తనిఖీలు చేపట్టారు. ఇంత భారీ మొత్తంలో సొత్తు లభించడంతో పోలీసులు అవాక్కయ్యారు. గురవమ్మ అల్లుడు గురునాథం ఇతర రాష్ట్రాల నుంచి బంగారం, వెండి తెచ్చి విక్రయాలు జరుపుతుంటాడని, ఓ కేసులో నిందితుడిగా ఉన్న క్రమంలో పోలీసులు అతని ఇంటికి తనిఖీలకు వెళ్లే సమయానికి మూట ముల్లె సర్దుకుని పరారయ్యాడని తెలిసింది. ఈ నేపథ్యంలో ఎస్పీ జిందాల్‌కు వచ్చిన సమాచారంతో మహేంద్ర కాలనీలో తనిఖీలకు ఎస్పీ ఆదేశించగా గురునాథం అత్త వద్ద ఈ సొత్తు లభించింది. గుంటూరు నుంచి పోలీసుల బృంద సభ్యులు తెనాలి పోలీసులు తెల్లవారుజామున మూడు గంటలకు రైల్వేస్టేషన్ వద్దకు రావాలని సమాచారమిచ్చి హుటాహుటిన ఇక్కడకు వచ్చారు. స్థానిక పోలీసులను వెంటబెట్టుకుని తనిఖీలు నిర్వహించారు. స్థానిక పోలీసులకు కేసుకు సంబంధించిన వివరాలు చెప్పకుండానే గుంటూరు నుంచి వచ్చిన బృందం లభించిన సొత్తుతో నేరుగా ఎస్పీ వద్దకు వెళ్లిపోయింది.


