రాజీ చేసేలా కృషి చేయాలి
ఎక్కువ కేసులు
జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి సాయి కల్యాణ్ చక్రవర్తి
గుంటూరులీగల్: శిక్షణ పూర్తయిన న్యాయవాదులు మధ్యవర్తిత్వాన్ని వృత్తిగా ఎంచుకొని ఎక్కువ సంఖ్యలో కేసులను రాజీ చేసే దిశగా కృషి చేయాలని, కక్షిదారులకు సరైన న్యాయం చేసేదిశగా మధ్యవర్తిత్వంపై అవగాహన కల్పించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్మన్ బి.సాయి కల్యాణ్ చక్రవర్తి అన్నారు. సుప్రీంకోర్టు మీడియేషన్, కన్సిలియేషన్ ప్రాజెక్ట్ కమిటీ న్యూఢిల్లీ, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ, అమరావతి ఆదేశాల మేరకు గుంటూరు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ గుంటూరు జిల్లాలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు ఎంపిక చేసిన న్యాయవాదులకు మధ్యవర్తిత్వం మీద 40 గంటలపాటు ఏర్పాటుచేసిన శిక్షణ కార్యక్రమం శుక్రవారంతో ముగిసింది. సుప్రీంకోర్టు మీడియేషన్, కాన్సిలియేషన్ ప్రాజెక్ట్ కమిటీ శిక్షకులు శ్రీలాల్ వారియర్, నీనా ఖరేలు శిక్షణ ఇచ్చారు. పలు అంశాలపై సలహాలు, సూచనలు చేశారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి న్యాయవాదులకు అభినందనలు తెలిపి సలహాలు, సూచనలు ఇచ్చారు. ప్రతి ఒక్కరూ వారి అనుభవాలను పంచుకొని మధ్యవర్తిత్వంపై మరింత అవగాహన పెంచుకొనే దిశగా కృషి చేయాలన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సయ్యద్ జియాఉద్దీన్ మాట్లాడుతూ శిక్షణ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అందరికి అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో ట్రైనీ న్యాయవాదులు, న్యాయవాదులు పాల్గొన్నారు.


