గణతంత్ర వేడుకల ఏర్పాట్లు పరిశీలించిన మంత్రి
తాడికొండ: రాజధాని ప్రాంతంలో నిర్వహించే గణతంత్ర వేడుకల ఏర్పాట్లను పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి నారాయణ శుక్రవారం పరిశీలించారు. రాయపూడి సీడ్ యాక్సిస్ రోడ్డు సమీపంలో మంత్రుల బంగ్లాల ఎదురుగా ఉన్న పెరేడ్ గ్రౌండ్‌లో వేడుకలు నిర్వహించనున్నారు. 22 ఎకరాల్లో పెరేడ్ కోసం గ్రౌండ్, వీవీఐపీ, వీఐపీ పార్కింగ్‌కు 15 ఎకరాలు, పబ్లిక్ పార్కింగ్‌కు 25 ఎకరాలు కేటాయించారు. అమరావతి రైతులకు ప్రత్యేకంగా వీఐపీ గ్యాలరీ ఏర్పాటు చేయడంతోపాటు వేడుకలకు హాజరుకావాలని ఆహ్వాన పత్రికలను అధికారులు పంపుతున్నారు. ఈ వేడుకలకు మొత్తం 13 వేల మందికి సీటింగ్ ఏర్పాట్లు చేస్తున్నట్లు సీఆర్డీఏ అధికారులు మంత్రికి వివరించారు. వేడుకలకు హాజరయ్యే వీఐపీలు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులను మంత్రి నారాయణ ఆదేశించారు.


