ఇష్టపడి చదివి ఉన్నత స్థానాలకు చేరుకోవాలి
గుంటూరు రూరల్: ప్రతి విద్యార్థి కష్టంతో కాకుండా ఇష్టపడి చదువుకుని ఉన్నత శిఖరాలను చేరాలని గుంటూరు సీజీఎస్‌టీ కమిషనర్ సుజిత్‌మల్లిక్ తెలిపారు. గురువారం నల్లపాడు గ్రామంలోని పీఎం కేంద్రియ విద్యాలయం వార్షికోత్సవం నగరంలోని శ్రీ వేంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమాన్ని కమిషనర్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థులు ఉన్నత విలువలతో కూడిన విద్యతోపాటు, సమాజాభివృద్ధికి అవసరమైన మానవీయ దృక్పథాన్ని కలిగి ఉండాలన్నారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఎప్పటికప్పుడు అప్‌డేట్ అవుతూ లక్ష్య సాధన దిశగా కృషిచేయాలని తెలిపారు. సీజీఎస్‌టీ జాయింట్ కమిషనర్ దాసరి రామకృష్ణ మాట్లాడుతూ వేడుకల్లో విద్యార్థుల ప్రదర్శనలు, నృత్యాలు ఎంతో ఆనందాన్ని కలిగించాయన్నారు. ఇదే ఉత్సాహంతో విద్యార్థులు నూరుశాతం ఉత్తీర్ణత, ఉత్తమ మార్కులు సాధించాలని ఆకాంక్షించారు. పాఠశాల ప్రిన్సిపాల్ బొంతా శేఖర్ మాట్లాడుతూ ప్రతి విద్యార్థికి ఉజ్వల భవిష్యత్తు లక్ష్యంగా విద్యాబోధన చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో విద్యార్థుల ప్రదర్శనలు ఆహూతులను అలరింపజేశాయి. వివిధ పోటీలను నిర్వహించి విద్యార్థులకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
కేంద్రియ విద్యాలయం వార్షికోత్సవంలో సీజీఎస్‌టీ కమిషనర్ సుజిత్ మల్లిక్


