సంక్షేమ హాస్టళ్లకు డైట్ బిల్లులు జమ
నెహ్రూనగర్ (గుంటూరు ఈస్ట్): ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ హాస్టళ్లకు గత సంవత్సరం అక్టోబర్ నుంచి డైట్ బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. బడ్జెట్ ఉన్నప్పటికీ బిల్లులకు సంబంధించిన నిధులు విడుదల చేయకపోవడంతో హాస్టల్ వార్డెన్లు అప్పు చేసి విద్యార్థులు భోజనం పెడుతున్నారు. దీనిపై సాక్షి దినపత్రికలో ఈ నెల 21వ తేదీన ‘సంక్షేమం’లో సంక్షోభం అనే కథనం ప్రచురితమైంది. దీనిపై స్పందించి హాస్టళ్లకు డైట్ బిల్లులను 22వ తేదీన ప్రభుత్వం విడుదల చేసింది. వార్డెన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సాంఘిక సంక్షేమ శాఖ డైరెక్టర్ లావణ్యవేణి గురువారం రాష్ట్ర వ్యాప్తంగా సాంఘిక సంక్షేమ శాఖ అధికారులు, వార్డెన్లతో జూమ్ మీటింగ్ నిర్వహించారు. డైట్ బిల్లులు చెల్లింపుల్లో ఆలస్యమైతే, మెను సక్రమంగా అమలు చేయని పక్షంలో వార్డెన్లతో పాటు ఏఎస్‌డబ్ల్యూఓలు, ఆపై అధికారులపై కూడా చర్యలు ఉంటాయని హెచ్చరించినట్లు సమాచారం. గుంటూరు జిల్లా సాంఽఘిక సంక్షేమ హాస్టళ్ల నిర్వహణలో చాలా సమస్యలు ఉన్నాయని, వాటిని సరిదిద్దుకోకపోతే బదిలీ చేయక తప్పదని డెప్యూటీ డైరెక్టర్‌కు చురకలు అంటించారని సమాచారం.
సంక్షేమ హాస్టళ్లకు డైట్ బిల్లులు జమ


