గూండా‘గిరి’.. చావే మరి!
భద్రత కల్పించకపోతే మేమే చచ్చిపోతాం
పోలీసుల సమక్షంలోనే ఇప్పటికి రెండుసార్లు దాడి చేశారు మా మగవాళ్లు ఏమయ్యారో ఇప్పటికీ తెలియదు దాడి చేసిన గూండాలు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబుతోనే తిరుగుతున్నారు ....వాళ్లని అరెస్ట్ చేయలేదు మేం ఎక్కడికి వెళ్లకుండా మా ఆడవాళ్లపై నిఘా పెట్టారు నరకం ఎలా ఉంటుందో చూపిస్తున్నారు చంద్రబాబు ప్రభుత్వంలో మాకు న్యాయం జరగదు అందుకే చనిపోవడానికి అనుమతి అడుగుతున్నాం బాపట్ల జిల్లా చుండూరు మండలం కేఎన్ పల్లి మహిళల ఆవేదన ఒక ఉన్నతాధికారితో ఛాటింగ్‌ను ఫేస్‌బుక్‌లో పెట్టి వెంటనే తొలగించిన రౌడీషీటర్
సాక్షి ప్రతినిధి, గుంటూరు: రెండురోజుల కిందట సంక్రాంతి కోడిపందేల బరి నిర్వహించిన తెలుగుదేశం పార్టీకి చెందిన రౌడీషీటర్ బాలకోటిరెడ్డి తన వర్గంతో కేఎన్ పల్లితో పాటు చుండూరు, మరో రెండు గ్రామాల్లో వైఎస్సార్‌సీపీ కార్యకర్తల ఇళ్లపై దాడులకు దిగారు. ఇళ్లలో సామాన్లు, వాహనాలు ధ్వంసం చేశారు. ఇదంతా పోలీస్ పికెట్ ఉండగానే జరగడం గమనార్హం. వినాయకచవితి నిమజ్జనం సందర్భంగా కూడా వీరే వైఎస్సార్‌సీపీ గ్రామ సర్పంచ్ నాగేశ్వరరావు ఇంటితో పాటు పలువురిపై దాడులకు దిగారు. అప్పుడు ఏడు ఫిర్యాదులు చేశారు. పోలీసులు ఒక్క ఎఫ్‌ఐఆర్ కూడా కట్టలేదు. మరోవైపు ఏ రౌడీషీటర్ ఆధ్వర్యంలో దాడి జరిగిందో ఆ బాలకోటిరెడ్డి తనకు ఒక పోలీసు అధికారితో జరిగిన వాట్సప్ ఛాటింగ్‌ను ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్ చేశాడు. అందులో ఆ అధికారితో దాడికి ముందు, దాడికి తర్వాత మాట్లాడిన వాట్సప్ కాల్స్‌తో పాటు ఒక సీఐపై ఫిర్యాదు, ఇద్దరి మధ్య జరిగిన ఆర్థిక లావాదేవీల సమాచారం ఉంది. కొద్దిసేపటి తర్వాత ఈ చాట్‌ను బాలకోటిరెడ్డి తొలగించడం గమనార్హం. పోలీసులతో ఉన్న సంబంధ బాంధవ్యాల కారణంగానే వారు పూర్తిగా నిందితులకు కొమ్ము కాస్తున్నారని బాఽధితులు ఆరోపిస్తున్నారు. తాజాగా కూడా ఇదే పరిస్థితి కొనసాగుతోంది. మహిళలను కూడా గ్రామం నుంచి బయటకు వెళ్లనివ్వడం లేదు. వైఎస్సార్‌సీపీ నాయకులను పరామర్శకు కూడా గ్రామానికి వెళ్లకుండా అడ్డుకుంటున్నారు. దీంతో బాధితులందరూ బుధవారం గుంటూరు వచ్చి మీడియాతో మాట్లాడారు.
మాకు తెలుగుదేశం గూండాల చేతుల్లో చావాలని లేదు. మాకు పోలీసులు భద్రత కల్పించకపోతే మేమే ఆత్మహత్య చేసుకుని చనిపోతాం అనుమతించండి.. పోలీసుల సమక్షంలో ఇప్పటికి రెండుసార్లు దాడులు చేశారు. దాడుల భయంతో మా మగవారు ఊరు వదిలి వెళ్లిపోయారు. వారు ఏమయ్యారో తెలియదు. దాడులు చేసిన గూండాలు మాత్రం వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు పక్కన ఇప్పటికీ తిరుగుతున్నారు. పోలీసులు మాపై నిఘా పెట్టి మమ్మల్ని వేధిస్తున్నారు. ఈ ప్రభుత్వంపై మాకు నమ్మకం లేదు. ఇప్పటికే జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఆత్మహత్యకు అనుమతి ఇవ్వమని కోరాం. ఇప్పటికై నా ఈ దాడులు ఆపకపోతే మాకు చావే శరణ్యం.
– వేమూరు నియోజకవర్గం చుండూరు మండలం కేఎన్ పల్లి మహిళలు


