రాజధానిలో రెవెన్యూ లీలలపై ఆగ్రహం
●సాక్షి కథనానికి స్పందించిన ఉన్నతాధికారులు
●నివేదిక సమర్పించాలనే ఆదేశాలతో అధికారులు ఉక్కిరిబిక్కిరి
●ఎట్టకేలకు సాయంత్రానికి ఓ నివేదిక సిద్ధం చేసిన అధికారులు
తాడికొండ: రాజధానిలో రూ.కోట్ల విలువైన భూమికి ఎసరు పెట్టిన వైనంపై సాక్షి దినపత్రికలో ‘బతికుండాగానే చంపేశారు...’శీర్షికన బుధవారం ప్రచురితమైన కథనానికి ఉన్నతాఽధికారులు స్పందించారు. ఈ వ్యవహారంపై పూర్తిస్థాయి నివేదిక అందజేయాలని ఆదేశించారు. దీంతో అధికారులు మల్లగుల్లాలు పడి సాయంత్రానికి ఓ నివేదిక సిద్ధం చేశారు. ఇందులో సదరు మహిళ ఎవరు, ఎక్కడి నుంచి వచ్చింది. ఎక్కడ దరఖాస్తు చేసింది. ఆమె వద్ద స్టేట్‌మెంట్ రికార్డు చేశారా లేదా... పొలం చుట్టు పక్కల ఉన్న రైతులను ఈ భూమి ఎవరిది అని అడిగి హద్దు దారుల స్టేట్‌మెంట్‌లు రికార్డు చేశారా లేదా అనే దానిపై ఇప్పుడు సందిగ్ధత నెలకొంది. అంతా మేమేగా అంటూ .... ఇవేమీ లేకుండా రికార్డుల్లో పేర్లు తొలగించి తాపీగా మరో పేరు ఎక్కించారా అనే దానిపై రెవెన్యూ వర్గాల్లోనే తీవ్ర చర్చ నడుస్తుంది.
● తెనాలికి చెందిన ఓ టీడీపీ బ్రోకర్ కనుసన్నల్లోనే ఈ తంతు అంతా నడిచిందని అందరూ చర్చించుకుంటుండగా దరఖాస్తును తాడికొండలో కాకుండా వేమూరు నియోజకవర్గంలో ఆన్‌లైన్‌లో నమోదు చేయించినట్టు అధికారులు చెబుతున్నారు.
● తాడికొండకు చెందిన పొలానికి భీమవరంలో వీలునామా, రాజమండ్రిలో డెత్, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ పుట్టించి ఊరు, పేరు లేని ఓ మహిళను తీసుకొచ్చి ఆన్‌లైన్‌లో నమోదు చేయడం వెనుక ఉన్న వ్యక్తులు ఎవరు అనేదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇందులో బోగస్ సర్టిఫికెట్లు ఇవ్వడంలో దిట్ట అయిన ప్రస్తుతం రాజధానిలో పనిచేస్తున్న ఓ వీఆర్వో పాత్ర పూర్తిగా ఉన్నట్లు ఇప్పటికే స్పష్టం కాగా ఆయన గతంలో తాడికొండ మండలంలో పనిచేసినపుడు పలు తప్పుడు పొజిషన్‌న్ సర్టిఫికెట్లు ఇచ్చి రూ. లక్షలు కొల్లగొట్టాడు.
● అప్పట్లో ఇవన్నీ విచారణలో తప్పుడు ధృవపత్రాలు అని తేలడంతో లాం గ్రామంలో పలు ఇళ్ళను అధికారులు నేలమట్టం చేశారు.
● ఆయనే మళ్ళీ రూ. కోట్ల రూపాయల స్కామ్‌కు శ్రీకారం చుట్టడంతో తాడికొండ మండలం ఉలిక్కిపడింది.
● ప్రస్తుతం జరిగిన కుంభకోణంలో ఉన్న టీడీపీ నాయకులు, ఎవరు, వారి పాత్ర ఎంత అనేదానిపై కూడా ‘సాక్షి’లో వచ్చిన కథనంతో కలకలం రేగింది.
● దీనికి సంబంధించి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసిన పత్రాలు మీడియాకు ఇవ్వాలని కోరగా ఇచ్చేందుకు తహసీల్దార్ నిరాకరించడం కొసమెరుపు.
రాజధానిలో రెవెన్యూ లీలలపై ఆగ్రహం


