జేఈఈ మెయిన్స్ ప్రారంభం
గుంటూరు ఎడ్యుకేషన్: ఐఐటీ, ఎన్‌ఐటీల్లో ప్రవేశాల కోసం జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్స్–2026 మొదటి సెషన్ పరీక్షలు బుధవారం ప్రారంభమయ్యాయి. గుంటూరు, పల్నాడు జిల్లాల్లో ఏర్పాటు చేసిన ఆరు కేంద్రాల్లో ఉదయం, మధ్యాహ్నం రెండు విడతలుగా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ) నిర్వహించారు. బీటెక్, బీఈ, బీ ఆర్క్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఉద్దేశించిన జేఈఈ మెయిన్స్ మొదటి సెషన్ పరీక్షలు ఈనెల 29 వరకు జరగనున్నాయి. జేఈఈ మెయిన్స్ నిర్వహిస్తున్న నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) సీబీటీ విధానంలో ఆన్‌లైన్ పరీక్షల కోసం గుంటూరులో పల్నాడు జిల్లాల్లోని వివిధ ఇంజినీరింగ్ కళాశాలల్లో ఏర్పాటు చేసిన కేంద్రాల పరిధిలో విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్థులకు విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఉదయం గంటల పరీక్షకు 7 గంటలకే కేంద్రాలకు చేరుకోవాలని ఎన్‌టీఏ నిర్ధేశించడంతో దూర ప్రాంతాలకు చెందిన విద్యార్థులు, వారి వెంట వచ్చిన తల్లిదండ్రులు సకాలంలో చేరుకునేందుకు ఇబ్బందులు పడ్డారు.


