కాజా టోల్‌గేట్ వద్దఅదుపు తప్పిన లారీ
మంగళగిరి టౌన్: మంగళగిరి మండలం కాజా టోల్‌గేట్ వద్ద ఓ లారీ అదుపు తప్పిన ఘటన మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. సేకరించిన వివరాల మేరకు విజయవాడ నుంచి కేరళ వైపు వెళ్తున్న కాటన్ బెయిల్ లోడ్ తో ఉన్న లారీ బ్రేకులు ఫెయిలవడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. లారీ డ్రైవర్ అప్రమత్తతో టోల్ ప్లాజా వద్ద టోల్ ఫీజు వసూలు చేసే ఒక కౌంటర్ వద్ద ఏర్పాటు చేసిన డివైడర్‌ని ఢీ కొట్టి ఆగిపోయింది. దాంతో టోల్‌గేట్ కు సంబంధించిన కొంత సామగ్రి దెబ్బతింది. ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో టోల్ ప్లాజా సిబ్బందితో పాటు వాహనదారులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటన జరగడంతో టోల్ ప్లాజా వద్ద భారీగా ట్రాఫిక్ ఆగిపోయింది.
ఏఐబీఈ– 2025లో వీఎస్‌ఎల్ నూరుశాతం ఉత్తీర్ణత
తాడికొండ: వీఐటీ–ఏపీ వర్సిటీలోని వీఐటీ–ఏపీ స్కూల్ ఆఫ్ లా (వీఎస్‌ఎల్) విద్యార్థులు ఆల్ ఇండియా బార్ ఎగ్జామినేషన్ (ఏఐబీఈ) 2025లో నూరుశాతం ఉత్తీర్ణత సాధించినట్లు యాజమాన్యం మంగళవారం తెలిపింది. ఇది న్యాయ విద్యలో రాణించడానికి వీఐటీ–ఏపీ స్కూల్ ఆఫ్ లా నిబద్ధతను ప్రతిబింబించే ఒక అద్భుతమైన మైలురాయి అన్నారు. వీఐటీ–ఏపీ స్కూల్ ఆఫ్ లా డీన్ డాక్టర్ బెనార్జీ చక్కా మాట్లాడుతూ వీసీ డాక్టర్ అరుళ్ మౌళి వర్మన్, రిజిస్ట్రార్ డాక్టర్ జగదీష్ చంద్ర ముదిగంటి సహకారం, వర్సిటీ చాన్స్‌లర్ డాక్టర్ జి.విశ్వనాథన్ మద్దతు, అధ్యాపకుల అంకితభావంతో కూడిన ప్రయత్నాలతో, వీఎస్‌ఎల్ విద్యార్థులు అత్యుత్తమ నైపుణ్యాన్ని ప్రదర్శించారన్నారు.
కాలువలో పడి వృద్ధురాలు మృతి
చందోలు(కర్లపాలెం): చందోలు గ్రామానికి చెందిన ఓ వృద్ధురాలు కాలువలో పడి మృతిచెందిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చందోలు ఎస్‌ఐ ఎంవీ శివకుమార్ యాదవ్ తెలిపిన వివరాల మేరకు పిట్టలవానిపాలెం మండలం చందోలు పంచాయతీ పెద దళితవాడ గ్రామానికి చెందిన మండే భూలక్ష్మి(70) చందోలు గ్రామంలోని వైన్ షాపు సమీపంలో ఉన్న ఆర్మండ్ కాలువలో పడి మృతిచెందినట్లు తెలిపారు. భూలక్ష్మి ఈనెల 17వ తేదీన మధ్యాహ్నం నుంచి కనిపించటం లేదని కుటుంబ సభ్యులు తమకు ఫిర్యాదు చేశారని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. మంగళవారం ఆర్మండ్ చానల్‌లో మృతదేహం ఉన్న విషయం తెలుసుకుని బయటకు తీయించి కుటుంబ సభ్యుల సమక్షంలో భూలక్ష్మిగా గుర్తించామని తెలిపారు.


