గుండెపోటుతో క్రైం బ్రాంచ్ ఎస్‌ఐ మృతి
వినుకొండ: వ్యక్తిగత పనులపై వినుకొండ వచ్చిన ఎస్‌ఐ గుండెపోటుతో మృతిచెందిన ఘటన వినుకొండలో మంగళవారం రాత్రి జరిగింది. సేకరించిన వివరాల ప్రకారం ప్రకాశం జిల్లా కురిచేడుకు చెందిన డి.లక్ష్మీప్రసాదు (60) గతంలో వినుకొండలో ఎస్‌ఐగా బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం నర్సరావుపేట జిల్లా క్రైం బ్రాంచ్‌లో ఎస్‌ఐగా విధులు నిర్వహిస్తున్నారు. అయితే స్వగ్రామం కురిచేడు నుంచి వ్యక్తిగత పనులపై వినుకొండ రైల్వేస్టేషనుకు వచ్చిన ఆయన తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే వినుకొండ పోలీస్టేషనుకు సమాచారం ఇవ్వగా లక్ష్మీప్రసాదును స్థానికంగా ఉన్న ఓ ప్రయివేటు వైద్యశాలకు తరలించారు. అప్పటికే ఆయన మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు.
నెల్లూరు సబ్ జైల్‌కు అమృతలూరు ఎస్‌ఐ తరలింపు
వేమూరు: అమృతలూరు ఎస్‌ఐ రవితేజను నెల్లూరు సబ్‌జైలుకు తరలించారు. యువతిని మోసగించిన కేసులో న్యాయమూర్తి సోమవారం పదేళ్ల శిక్ష విధించిన విషయం విధితమే. నగరపాలెం పోలీసులు నిందితుడిని మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వైద్యపరీక్షలు నిర్వహించి సబ్‌జైలుకు తరలించారు. 2023 నగరంపాలెం ఎస్‌ఐగా పని చేస్తున్న సమయంలో రవితేజపై గుంటూరు జీజీహెచ్‌లో స్టాఫ్ నర్సుగా పని చేస్తున్న యువతి రవితేజ మోసం చేశాడని, న్యాయం చేయాలని కోరుతూ తాడేపల్లి ఐద్వా ప్రతి నిధులను ఆశ్రయించింది. ఐద్వా సహకారంతో గుంటూరు ఎస్పీకి స్పందనలో ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు చేశారు. నేరం రుజువు కావడంతో జైలు శిక్ష విధించగా సబ్ జైల్‌కు తరలించారు.


