విద్యుత్ శాఖ విజిలెన్స్ తనిఖీలు
గుంటూరు రూరల్: విద్యుత్ శాఖ విజిలెన్స్ విభాగం, ఆపరేషన్స్ విభాగం పర్యవేక్షక ఇంజినీర్ రమేష్ ఆధ్వర్యంలో డీ10 సెక్షన్ నందున్న గుంటూరు, బుడంపాడు గ్రామాల్లో మంగళవారం విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్‌లు డీపీ కేఏ కరీమ్, జి.సుందరబాబు, ఆపరేషన్స్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ పీహెచ్ ఖాన్‌లు తెలిపిన వివరాల ప్రకారం.. తనిఖీలలో 56 మంది అధికారులు, 168 మంది సిబ్బంది, 56 బృందాలుగా ఏ్పడి 5,298 సర్వీసులను తనిఖీ చేయటం జరిగిందన్నారు. అనుమతించిన కేటగిరీ కాకుండా ఇతర కేటగిరిలలో విద్యుత్ వినియోగిస్తున్న నలుగురికి రూ 38 వేలు, అనుమతించిన లోడు కంటే అదనంగా విద్యుత్ వినియోగిస్తున్న 212 మందికి రూ10.08 లక్షలు మొత్తం రూ 10.46 లక్షలు అపరాధ రుసుంను విధించారని తెలిపారు. విద్యుత్ చౌర్యానికి పాల్పడితే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు. విద్యుత్ చౌర్యంపై ఫిర్యాదులు చేసేందుకు 9440812263, 9440812361 నెంబర్లకు నేరుగా కానీ వాట్సప్ ద్వారా కానీ సంప్రదించి ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. దాడులలో ఆపరేషన్ విభాగం డీఈఈ షేక్ ముస్తాక్ అహ్మద్, డీపీఈ, డీఈఈ కె.రవికుమార్, ఎస్.శ్రీనివాసరావు, ఏఓ దేవదాస్, ఎం.సతీష్‌కుమార్, శివశంకర్, కె.కోటేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.


