బతికుండగానే చంపేశారు...
ఎమ్మెల్యేకు పలువురు ఫిర్యాదు
● రాజధానిలో రెవెన్యూ లీలలు
● తప్పుడు పత్రాలు సృష్టించి రూ.25
కోట్ల విలువైన భూమి కబ్జాకు యత్నం
● రాజమండ్రిలో మరణ ధృవీకరణ
పత్రం, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్
● భీమవరంలో వీలునామా సర్టిఫికెట్
● తాడికొండలో పనిచేసి రాజధానికి
బదిలీ అయిన వీఆర్వో సహకారంతో
8.32 ఎకరాలకు ఎసరు
● తప్పుడు పత్రాలతో ఆన్‌లైన్‌లో
నమోదుకు పచ్చజెండా ఊపిన
రెవెన్యూ అధికారులు
● దత్త పుత్రిక అని రాసిన వీలునామా
ఆధారంగా ఆధార్ కార్డు లేకుండానే
ఆన్‌లైన్‌లో పేరు మార్పు
● రూ.కోట్లలో చేతులు మారినట్లు
ఆరోపణలు
● తాడికొండకు చెందిన పలువురు
హస్తం ఉన్నట్లు సమాచారం
● ఆమెరికా నుంచి బయలుదేరిన
అసలైన హక్కుదారుడు
తాడికొండ: తాడికొండ గ్రామానికి చెందిన వంగర హనుమంత సుబ్రహ్మణ్య శాస్త్రికి స్థానికంగా సర్వే నెంబర్ 1151లో 8.32 ఎకరాల భూమి ఉంది. ఆయన ఎప్పటి నుంచో హైదరాబాద్‌లో ఉంటూ ఉద్యోగ రీత్యా అమెరికాలో స్థిరపడ్డాడు. స్థానికంగా తనకున్న పొలం మాత్రం పెదపరిమి గ్రామానికి చెందిన రైతుకు కౌలుకు ఇవ్వగా ప్రతి ఏటా ఆయన కౌలు నగదును ఆన్‌లైన్ ద్వారా హక్కుదారుడైన సుబ్రహ్మణ్య శాస్త్రికి పంపిస్తుంటాడు.
వ్యవహారం నడిచిందిలా...
ఈ భూమిపై కన్నుపడిన తాడికొండలో గతంలో పనిచేసిన ఓ వీఆర్వో స్థానికంగా పట్టించుకునే నాథుడు లేడని తెలిసి డాక్యుమెంట్ రైటర్ వద్ద సహాయకులుగా పనిచేస్తున్న ఇద్దరు వ్యక్తులతోపాటు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వ్యక్తిని ఎంచుకొని పక్కాగా స్కెచ్ గీశాడు. ఇందులో భాగంగా తనకు గతంలో నుంచి అనుభవం ఉన్న తప్పుడు పత్రాల రూపకల్పనకు శ్రీకారం చుట్టి పదునుపెట్టి తెనాలి ప్రాంతానికి చెందిన ఓ టీడీపీ నాయకుడు ద్వారా కథ నడిపించాడు. రాజధాని ప్రాంతంలో ఎకరం రూ.2–3 కోట్లకు పైగా ధరలు పలుకుతున్న నేపథ్యంలో ఆన్‌లైన్‌లో పేరుమార్చి ఎవరో ఒకరిని ఏ మార్చి అమ్ముకొని సొమ్ము చేసుకుందామనే యోచనతో ఓ పెట్టుబడిదారుడిని వెదికి పట్టుకొచ్చి కథంతా నడిపించారు. ఇందులో భాగంగా వంగర హనుమంత సుబ్రహ్మణ్య శాస్త్రికి పిల్లులు లేని కారణంగా బంధువుల అమ్మాయి వరలక్ష్మిని దత్తత తీసుకొని ఆమెకు పొలం రాసినట్లు 1997లో భీమవరం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో వీలునామా చేసినట్లు తప్పుడు పత్రాలు సృష్టించారు. దీనికి తోడు ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ కోసం ఈనెల 6వ తేదీన దరఖాస్తు చేయగా అదే తేదీన రాజమండ్రిలో పత్రం ఇచ్చినట్లు జతచేయడం మరో విశేషం. మరణ ధ్రువీకరణ పత్రంలో ఆయన 2019లో మరణిస్తే ఈనెల 11వ తేదీన ధ్రువీకరణ పత్రం జారీ చేయగా ఇవన్నీ తీసుకున్న కేవలం రెండే రోజుల్లో అంటే ఈ నెల 13వ తేదీన ఆన్‌లైన్‌లో సుబ్రహ్మణ్య శాస్త్రి పేరు తొలగించి సలుమూరి వరలక్ష్మి పేరును ఎక్కించారు. ఈ వ్యవహారంలో సదరు నిందితులు ఎక్కడా కూడా ఆ మహిళ అడ్రస్ కానీ, ఆధార్ నంబర్ లేదా ఆధార్ కార్డు జతచేసిన దాఖలాలు కనిపించకుండా జాగ్రత్త పడటం విశేషంవ్యవహారం బయటకు పొక్కిందిలా...
గ్రామానికి చెందిన కొందరు టీడీపీ నాయకులకు ఈ వ్యవహారంలో ముడుపులు ముట్టజెబుతామని చెప్పిన సదరు వ్యక్తులు ఆన్‌లైన్‌లో పేరు మార్చిన అనంతరం వారిని లెక్కచేయకపోవడంతో వ్యవహారం బయటకు పొక్కింది. రూ.కోట్ల విలువైన భూముల వ్యవహారంలో తమను పక్కనబెట్టడంతో ఆగ్రహించిన సదరు వ్యక్తులు విషయం బయటకు కక్కడంతో వ్యవహారం బయటకు పొక్కింది.
తమకేమీ తెలియదు అంటున్న సిబ్బంది
తమకేం తెలియదు పైఅధికారి చేయమని ఇస్తే అన్నీ ఉన్నాయి కదా అని చేశామని చెబుతుండగా పై స్థాయి అధికారి మాత్రం ఎమ్మెల్యే సమక్షంలో మంగళవారం టీడీపీ నాయకులు ప్రశ్నించగా అన్ని పత్రాలు ఉన్నాయి కనుకే ఆన్‌లైన్‌లో చేర్చామని, హక్కుదారుడు వచ్చి ఓ స్టేట్‌మెంట్ ఇస్తే తొలగిస్తాం అంటూ నింపాదిగా సమాధానం చెప్పడంతో ఆశ్చర్యపోవడం వారి వంతైంది. అసలు భూమి ఉన్న హక్కుదారుడే మరణించలేదని, ఆయనకు పిల్లలు కూడా ఉన్నారని, దరఖాస్తు వచ్చినప్పుడు గ్రామంలో కనీసం విచారించకుండా బతికున్న మనిషిని చనిపోయినట్లు చూపిస్తే గుడ్డిగా ఎలా చేశారంటూ పలువురు ప్రశ్నించడంతో అధికారులు నీళ్లు నములుతున్నారు.
తాడికొండ మండల పరిషత్ కార్యాలయంలో మంగళవారం జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్‌కు స్థానిక నాయకులు పలువురు ఫిర్యాదు చేశారు. దీనిపై ఆర్డీవోతో విచారణ చేయించి బాధ్యులను సస్పెండ్ చేయిస్తానని ఆయన నాయకులకు హామీ ఇచ్చారు. తమ సామాజిక వర్గానికి చెందిన వారే ఈ వ్యవహారంలో ఉండటంతో పలువురు నాయకులు మీకేం కాదులే మేమున్నాం అంటూ భరోసా ఇస్తున్నట్లు సమాచారం.
రాజధానిలో భూముల ధరలకు రెక్కలు రావడంతో కబ్జాదారుల కన్ను పడింది. ప్రజల, ప్రభుత్వ భూములను కాపాడాల్సిన రెవెన్యూ అధికారులు కబ్జాదారులకు కొమ్ముకాస్తున్నారు. డబ్బుకు ఆశపడి ఎంతటి నీచానికై నా దిగజారుతున్నారు. మనిషి ప్రాణాలతో ఉన్నప్పటికీ చనిపోయినట్లు తప్పుడు ఽధ్రువీకరణ పత్రం, వీలునామా, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ చూపించడంతోపాటు ఓ మహిళను దత్తత తీసుకున్నట్లు చూపించి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 8.32 ఎకరాల భూమిని ఆన్‌లైన్‌లో పేరు మార్చి కబ్జా చేసేందుకు రంగం సిద్ధం చేశారు. ఈ విషయాలు తెలిసి అవాకై ్కన స్థానికులు అమెరికాలో ఉన్న భూమి హక్కుదారులకు సమాచారం ఇవ్వడంతో హుటాహుటిన బయలుదేరి వస్తున్నారు.
ఈ తంతులో తెనాలికి చెందిన టీడీపీ నాయకుడు పాత్ర ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. గతంలో కూడా ఓ భూమి వ్యవహారంలో రూ.30 లక్షలు తీసుకొని పనిచేయకుండా తిప్పుకుంటూ ఇబ్బందులు పెడుతున్నారని స్థానికులు చెబుతున్నారు. రెవెన్యూ శాఖలో సహకరించిన పెద్దలకు రూ.కోటికి పైగా ముట్టజెప్పినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. తాడికొండలో వీఆర్వోకు సహకరించిన వ్యక్తులకు రూ.50 లక్షల వరకు నగదు చేతులు మారగా ఈ తంతు నడిపించిన వీఆర్వోకు కూడా భారీగా ముట్టినట్లు చెబుతున్నారు. కింది స్థాయి అధికారులు సంతకాలు చేసినందుకు కూడా భారీ నజరానాలు అందాయని రెవెన్యూ శాఖలో గుసగుసలు వినిపిస్తున్నాయి.
బతికుండగానే చంపేశారు...
బతికుండగానే చంపేశారు...


