ఆంధ్రజ్యోతి దినపత్రిక ప్రతులు దహనం
విషపు రాతలపై వైఎస్సార్ సీపీ శ్రేణుల ఆగ్రహం ● ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు పరిశపోగు శ్రీనివాసరావు మాట్లాడుతూ పథకాలు అమలు చేతకాక గత ప్రభుత్వంపై నిందలు వేయడం నీతిమాలిన పని అని ధ్వజమెత్తారు. దీనికి పచ్చ మీడియా వంత పాడుతూ చంద్రబాబు తానా అంటే అవి తందానా అని తాళం వేస్తున్నాయని విమర్శించారు. ఆంధ్రజ్యోతి దినపత్రిక అందరి కన్నా ముందు వరుసలో నిలబడి నిస్సిగ్గుగా పత్రికా విలువలకు తిలోదకాలు ఇచ్చేసిందని దుయ్యబట్టారు. చంద్రబాబు ‘చెప్పేది కొండంత – చేసేది గోరంత‘ అయితే ఆంధ్రజ్యోతి మాత్రం దానికి పూర్తి రివర్సుగా కథనాలు వండి వడ్డిస్తోందని విమర్శించారు. తెలుగు దినపత్రికలా కాక తెలుగుదేశం కరపత్రికలా మారిపోయిన ఆంధ్రజ్యోతిని ప్రజలంతా బహిష్కరించాలని పిలుపునిచ్చారు.
● వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు సీహెచ్ వినోద్ మాట్లాడుతూ అన్ని పథకాలు క్రమంగా ఎత్తేయాలని టీడీపీ కూటమి ప్రభుత్వం కుట్ర చేస్తోందన్నారు. అందుకే ఆర్భాట ప్రచారాలతో ప్రజలను ఏమారుస్తోందని విమర్శించారు. పార్టీ మహిళా విభాగం నగర అధ్యక్షురాలు కేసరి సుబ్బులు మాట్లాడుతూ, తన అనుకూల మీడియాలో కథనాలు రాయిస్తోన్న చంద్రబాబు వైఖరిని తీవ్రంగా ఖండించారు. వైఎస్సార్ సీపీ యువజన విభాగం నగర ఉపాధ్యక్షుడు యర్రెడ్ల వెంకటేష్‌రెడ్డి మాట్లాడుతూ పిచ్చిపిచ్చి రాతలు రాస్తే.. చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మహిళా విభాగం నేతలు గనిక జాన్సీ, తోటకూర స్వర్ణలత, రజియా బేగం, వెంకాయమ్మ, తులసి, విజయ, విద్యార్థి విభాగం నేతలు అరుణ్, అభి, రోషన్, వీరాస్వామి, తేజ, వెంకటేశ్వరరెడ్డి, రోహన్, హరీష్ తదితరులు పాల్గొన్నారు.
విషపు రాతలపై వైఎస్సార్ సీపీ శ్రేణుల ఆగ్రహం
పట్నంబజారు (గుంటూరు ఈస్ట్): పచ్చ పత్రికల విషపు రాతలపై వైఎస్సార్ సీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిలువెల్లా రాతల్లో అబద్ధాలు తప్ప.. ఒక్క నిజం లేదని మండిపడ్డారు. అబద్ధాల పుత్రిక ఆంధ్రజ్యోతి పత్రికను బహిష్కరించాలన్నారు. పథకాల అమలుపై ఎల్లో మీడియాలో వచ్చిన కథనాలపై వైఎస్సార్ సీపీ విద్యార్థి, యువజన, మహిళా విభాగంతో పాటు నవ్యాంధ్ర ఎమ్మార్పీఎస్ శ్రేణులు కన్నెర్రజేశాయి. గుంటూరు లాడ్జి సెంటర్ వేదికగా కదం తొక్కాయి. వైఎస్సార్ స్టూడెంట్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు సిహెచ్ వినోద్, యువజన విభాగం నగర ఉపాధ్యక్షుడు యర్రెడ్ల వెంకటేష్‌రెడ్డి, నగర మహిళా విభాగం అధ్యక్షురాలు కేసరి సుబ్బులు, నవ్యాంధ్ర ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో అంబేడ్కర్ విగ్రహం ఎదుట నిరసన చేపట్టారు. అనంతరం తప్పుడు రాతల ఆంధ్రజ్యోతి దినపత్రిక ప్రతులను దహనం చేశారు.