రేపటి నుంచి విజ్ఞాన్ వర్సిటీలో ఏపీ స్పేస్ టెక్ సమ్మి
చేబ్రోలు: గుంటూరు జిల్లా వడ్లమూడిలోని విజ్ఞాన్ యూనివర్సిటీ, అమరావతిలోని ఆంధ్రప్రదేశ్ స్పేస్ టెక్ అకాడమీ, హైదరాబాద్‌లోని అనంత్ టెక్నాలజీస్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 22 నుంచి 24 వరకు ఆంధ్రప్రదేశ్ స్పేస్ టెక్ సమ్మిట్–2026ను నిర్వహిస్తున్నట్లు విజ్ఞాన్ ఇన్‌చార్జి వైస్ చాన్స్‌లర్ కేవీ క్రిష్ణకిషోర్ మంగళవారం తెలిపారు. ఈ సందర్భంగా సమ్మిట్‌కు సంబంధించిన బ్రోచర్‌ను విజ్ఞాన్ విద్యాసంస్థల చైర్మన్ లావు రత్తయ్య, ఏపీ సైన్స్ సిటీ సీఈఓ కేశినేని వెంకట్ తదితరులు ఆవిష్కరించారు. ఈ సమ్మిట్‌కు శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) డైరెక్టర్ ఈఎస్ పద్మకుమార్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారని వెల్లడించారు. ఎన్‌ఆర్‌ఎస్‌సీ డైరెక్టర్ డాక్టర్ ప్రకాష్ చౌహాన్, డీఆర్‌డీఓ మాజీ చైర్మన్ డాక్టర్ జి.సతీష్ రెడ్డి, ఏపీ ప్రభుత్వ రోడ్లు, భవన నిర్మాణాల శాఖ మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి గౌరవ అతిథులుగా పాల్గొననున్నట్లు తెలిపారు. అమరావతిలోని సైన్స్ సిటీ ఆఫ్ ఏపీ ఆధ్వర్యంలో మొట్టమొదటి సారిగా ‘సౌత్ ఇండియా రాకెట్రీ చాలెంజ్–2026’ను కూడా మూడు రోజుల పాటు ఇదే సమ్మిట్‌లో భాగంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
సౌత్ ఇండియా రాకెట్రీ చాలెంజ్–2026 ప్రధాన ఆకర్షణ
సమ్మిట్‌లో భాగంగా నిర్వహించే ‘సౌత్ ఇండియా రాకెట్రీ చాలెంజ్–2026’ లో దేశవ్యాప్తంగా ఇంజినీరింగ్, డిగ్రీ, స్కూల్, పాలిటెక్నిక్ విద్యార్థి బృందాలు పాల్గొననున్నాయని ఏపీ సైన్స్ సిటీ సీఈఓ కేశినేని వెంకట్ తెలిపారు. విజేతలకు ప్రత్యేక ట్రోఫీలు, సర్టిఫికెట్లు, నగదు బహుమతులు, ఇంటర్న్‌షిప్ అవకాశాలు అందజేయనున్నట్లు చెప్పారు. ఆసక్తిగల విద్యార్థులు యూనివర్సిటీ పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని తెలిపారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ పీఎంవీ రావు, ఆయా విభాగాల డీన్లు, విభాగాధిపతులు పాల్గొన్నారు.
ప్రత్యేక ఆకర్షణగా సౌత్ ఇండియా రాకెట్రీ చాలెంజ్–2026


