ఆ..బాలికను గుర్తించాం
పట్నంబజారు(గుంటూరు ఈస్ట్) : కుమార్తె అదృశ్యం అయిందని పీజీఆర్‌ఎస్‌లో పిల్లా ఏసోబు అనే వ్యక్తి ఫిర్యాదు చేసిన అంశంపై గుంటూరు ఈస్ట్ సబ్‌డివిజన్‌న్‌డీఎస్పీ షేక్ అబ్దుల్‌అజీజ్ లాలాపేట పోలీసుస్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. ఆర్.అగ్రహారం నిమ్మలపేటకు చెందిన పిల్లా ఏసోబు దివ్యాంగుడు. తన కుమార్తె గత ఏడాది మార్చి 15వ తేదీ నుంచి ఇంటి నుంచి వెళ్ళిపోయిందని, పీజీఆర్‌ఎస్‌లో ఫిర్యాదు చేశాడన్నారు. ఈ అంశంలో వాస్తవానికి ఏసోబు అంజలి అనే మహిళను వివాహం చేసుకున్నాడు. వీరికి 14 సంవత్సరాల బ్లెస్సీ అనే కుమార్తె ఉన్నది. ఏసోబు తన భార్యతో కలిసి గుంటూరు నగరంలోని వివిధ ప్రాంతాల్లో భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో ఏసోబు తన భార్య అంజలి, కుమార్తె బ్లెస్సీని కూడా తనతో కలిసి భిక్షాటనకు రావాలని బలవంతం చేయడం ప్రారంభించాడు. వారిద్దరు అందుకు నిరాకరించారు. ఈ నేపథ్యంలోనే తల్లి అంజలి, కుమార్తె బ్లెస్సీ కలిసి గత ఏడాది జవనరి 2వ తేదీన ఇంటి నుంచి వెళ్ళిపోయారు. అనంతరం ఏసోబు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అదే ఏడాది ఏప్రిల్ 22న కేసు నమోదు చేశారు. దర్యాప్తులో భాగంగా అంజలి, బ్లెస్సీల ఆచూకీ తెలిసిందని, గత సంవత్సరం మే 8వ తేదీన అంజలి లాలాపేట పీఎస్‌కు హాజరుకాగా, తన భర్త భిక్షాటన చేయమంటున్నాడని, అందుకే తాము వెళ్ళిపోయామని, తన కుమార్తెను తానే చూసుకుంటానని చెప్పిందన్నారు. తన భర్త మరో మహిళను వివాహం చేసుకుని, తనని మానసిక రోగిగా చూపిస్తూ తప్పుడు ప్రచారాలు చేస్తున్నాడని ఆమె చెప్పటం జరిగిందన్నారు. కుమార్తె బ్లెస్సీ కూడా తన తల్లి చెప్పిన విషయాలతో ఏకభవిస్తూ.. తన తండ్రితో కలిసి ఉండడానికి ఆసక్తి చూపలేదని వెల్లడించింది. దీంతో కేసును నిలిపివేయటం జరిగిందన్నారు. ప్రస్తుతం, అదృశ్యమైన బాలిక ఆచూకీ రంగారెడ్డి జిల్లా కీసర మండలంలో గుర్తించబడిందని, ఆమెను ఇక్కడకు తీసుకురావడానికి సిబ్బందిని పంపటం జరిగిందన్నారు. ఈ అంశంలో పోలీసులు నిర్లక్ష్యం వహించలేదని తెలిపారు.
తండ్రి భిక్షాటన చేయమంటున్నాడనే ఇల్లు వదిలి వెళ్లిపోయినట్టు
డీఎస్పీ అబ్దుల్ అజీజ్ వెల్లడి


