మధ్యవర్తిత్వంపై శిక్షణ తరగతులు ప్రారంభం
● తొలుత జిల్లా ప్రధాన న్యాయమూరి సాయికళ్యాణచక్రవర్తి మాట్లాడుతూ రాష్ట్రంలో మధ్యవర్తిత్వం ద్వారా వివాదాలను పరిష్కరించుకోవడం అనుకున్న స్థాయిలో జరగడం లేదన్నారు. దానికి న్యాయబద్ధమైన కారణాలు ఉన్నాయని తెలిపారు.
● మధ్యవర్తిత్వంలో స్థిరాస్తి, వివాహ సంబంధ వివాదాల, వాణిజ్య పరమైన వివాదాలు ప్రథమ స్థాయిలోనే పరిష్కరించడం తేలికని తెలిపారు. భవిష్యత్తులో మధ్యవర్తిత్వం ద్వారా కేసులు పరిష్కరించడానికి ఎక్కువ ప్రాముఖ్యత ఉంటుందని చెప్పారు.
● శిక్షణకు వచ్చిన న్యాయవాదులంతా మధ్యవర్తిత్వంలో నైపుణ్యాన్ని పెంచుకొని సుప్రీం కోర్టు అంచనాలకు తగినట్టు మధ్యవర్తిత్వంలో భాగస్వాములు కావాలన్నారు.
● జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సయ్యద్ జియాఉద్దీన్ మాట్లాడుతూ న్యాయవాదులకు శిక్షణ కార్యక్రమం మధ్యవర్తిత్వాన్ని సమర్థంగా, సులభతరం చేయడానికి ఉపయోగపడుతుందన్నారు. అధునాతన పద్ధతులలో మధ్యవర్తిత్వం ద్వారా కేసుల పరిష్కారానికి ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు.
● మొదటి రోజు శిక్షణ కార్యక్రమంలో జిల్లాకు సంబంధించిన న్యాయవాదులు మొత్తం 33 మంది పాల్గొన్నారు.
గుంటూరు లీగల్: జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జిల్లాలో రాష్ట్ర హైకోర్టు ఎంపిక చేసిన న్యాయవాదులకు మధ్యవర్తిత్వంపై 40 గంటల శిక్షణ తరగతులు సోమవారం ప్రారంభమయ్యాయి. ఈనెల 19 నుంచి 23వ తేదీ వరకు జరగనున్నాయి. శిక్షకులుగా సుప్రీం కోర్టు మీడియేషన్, కాన్సిలియేషన్ ప్రాజెక్ట్ కమిటీ కేరళ నుంచి లాల్ వారియర్ అడ్వకేట్, మధ్యప్రదేశ్ నుంచి మిస్ నీనాఖరే అడ్వకేట్‌లను నియమించారు. మొదటిరోజు జిల్లా ప్రధాన న్యాయమూర్తి సాయి కళ్యాణచక్రవర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సయ్యద్ జియాఉద్దీన్‌లు పాల్గొని జ్యోతి ప్రజ్వలనం చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.