పీఎంఈవై ఇళ్ల నిర్మాణాలకు అత్యధిక ప్రాధాన్యం
జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా
లక్ష్మీపురం(గుంటూరు వెస్ట్): జిల్లాలో పీఎంఈవై ఇళ్ల నిర్మాణాలకు మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చి పటిష్ట ప్రణాళిక ప్రకారం చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా తెలిపారు. సోమవారం కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ సమావేశ మందిరం నుంచి జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా హౌసింగ్, గ్రామ, వార్డు సచివాలయల సేవలు, ఉపాధి హామీ పథకం తదితర అంశాలపై ప్రత్యేక అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు మండలస్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ లే–అవుట్లు లోని ఆప్షన్ 1, 2లోని ఇళ్ల నిర్మాణాలు ఉగాది నాటికి నిర్దేశించిన లక్ష్యాల మేరకు పూర్తయ్యేలా మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలు నిరంతరం పర్యవేక్షిస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు.
సరస్ మేళా విజయం... ప్రజలది
సరస్ మేళా విజయం ప్రజలదేనని జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా అన్నారు. సరస్ మేళా విజయవంతం కావడం పట్ల సోమవారం కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా ప్రతినిధుల సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గుంటూరులో సరస్ మేళా గొప్ప విజయవంతమైందన్నారు. సరస్‌లో 343 ప్రదర్శన శాలలు ఏర్పాటు చేసి రూ.25 కోట్లకు పైగా విక్రయాలు చేశారని తెలిపారు. ఇది జాతీయ స్థాయి కార్యక్రమం అన్నారు. గుంటూరు ప్రజలు విజయవంతం చేయడంలో గొప్ప భాగస్వామ్యం వహించారని ప్రశంసించారు.


