గణతంత్ర వేడుకలకు సిద్ధం కావాలి
లక్ష్మీపురం (గుంటూరు వెస్ట్) : గణతంత్ర వేడుకలకు సిద్ధం కావాలని గుంటూరు జిల్లా కలెక్టర్ ఎ.తమీమ్ అన్సారియా అధికారులను ఆదేశించారు. గణతంత్ర వేడుకలపై సోమవారం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ సమీక్షించారు. రాష్ట్ర స్థాయి గణతంత్ర వేడుకలు తుళ్లూరు మండలం రాయపూడిలో జరుగుతున్నాయన్నారు. ఈ వేడుకలు విజయవంతంగా నిర్వహించేందుకు అధికారులు సమష్టిగా కృషి చేయాలని ఆదేశించారు. సీఆర్‌డీఏ, అన్ని శాఖల ప్రధాన కార్యాలయాలతో సమన్వయం చేసుకోవాలని అన్నారు. ఆయా శాఖలకు సూచించిన మేరకు శాఖల అభివృద్ధిని తెలియజేసే శకటాలను ఏర్పాటు చేయాలని చెప్పారు. తాగు నీరు, పారిశుధ్యం పక్కాగా ఉండాలని తెలిపారు. సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని సూచించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ తదితరులు పాల్గొన్నారు.


