21న హుండీ కానుకల లెక్కింపు
మంగళగిరి టౌన్ : మంగళగిరి పట్టణంలో వేంచేసి యున్న శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థాన హుండీ లెక్కింపు కార్యక్రమం ఈనెల 21వ తేదీన నిర్వహించనున్నట్లు కార్యనిర్వహణాధికారి సునీల్‌కుమార్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఎగువ, దిగువ సన్నిధులతో పాటు ఘాట్‌రోడ్‌లో ఉన్న శ్రీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో భక్తులు సమర్పించిన కానుకలు, మొక్కుబడుల హుండీలను 21వ తేదీ ఉదయం 9 గంటలకు లెక్కింపు నిర్వహిస్తున్నామని, ఆసక్తి గల భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చని పేర్కొన్నారు.
జెడ్పీ చైర్‌పర్సన్ కత్తెర హెనీ క్రిస్టినా
గుంటూరు ఎడ్యుకేషన్: తన రచనలతో సమాజాన్ని జాగృతం చేసిన యోగి వేమన చిరస్మరణీయుడని జెడ్పీ చైర్‌పర్సన్ కత్తెర హెనీ క్రిస్టినా అన్నారు. సోమవారం జెడ్పీ సమావేశ మందిరంలో ప్రముఖ కవి, తత్వవేత్త యోగి వేమన జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈసందర్భంగా హెనీ క్రిస్టినా మాట్లాడుతూ యోగి వేమన రచనలు ప్రస్తుత తరానికి ఆదర్శప్రాయమని అన్నారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈవో వి.జ్యోతిబసు, అకౌంట్స్ అధికారి శామ్యూల్ పాల్, పరిపాలనాధికారులు నిర్మల భారతి, రత్నబాబు, పూర్ణచంద్రారెడ్డి, మల్లేశ్వరరావు, నాగరాజు, ఉద్యోగులు పాల్గొన్నారు.
చిలకలూరిపేట టౌన్: తల్లి మందలించిందన్న చిన్న కారణంతో మనస్తాపానికి గురైన ఓ యువతి ఎలుకల మందు తిని ప్రాణాలు విడిచిన ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. పట్టణంలోని ఆదిఆంధ్ర కాలనీకి చెందిన బోగుమళ్ల అనురాధ (18) ఈ నెల 12న ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఎలుకల నివారణకు వాడే ’పేస్టు’ తినింది. మరుసటి రోజు ఆమెకు తీవ్రమైన జ్వరం రావడంతో అనుమానం వచ్చిన తల్లి పావని గట్టిగా నిలదీయగా అసలు విషయం బయటపడింది. కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యుల సూచన మేరకు మెరుగైన చికిత్స కోసం గుంటూరు జీజీహెచ్‌కు తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారుజామున మృతి చెందింది. ప్రకాశం జిల్లా మార్టూరు మండలం ద్రోణాదుల గ్రామానికి చెందిన మరియదాసు, పావని కుటుంబం మూడేళ్ల క్రితం ఉపాధి నిమిత్తం చిలకలూరిపేటకు వలస వచ్చారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు అర్బన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
పసి బిడ్డను వదిలేసిన గుర్తు తెలియని వ్యక్తి
లక్ష్మీపురం (గుంటూరు వెస్ట్) : మూడు రోజుల పసిబిడ్డను గుంటూరు పట్టాభిపురంలోని మాతృశ్రీ అనాథ ఆశ్రమంలో వదిలేసి వెళ్ళిన ఘటన సోమవారం రాత్రి చోటు చేసుకుంది. పట్టాభిపురం సీఐ గంగా వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం గుర్తు తెలియని వ్యక్తులు సుమారు మూడు రోజుల పసి బిడ్డను ఆశ్రమం బయట వదిలేసి వెళ్ళడంతో ఏడుపు విన్న ఆశ్రమం నిర్వాహకులు సీఐకు సమాచారం తెలియజేశారు. అనంతరం ఐసీడిఎస్ అధికారులకు అప్పగించారు.
21న హుండీ కానుకల లెక్కింపు


