బైబిల్ మిషన్ మహోత్సవాలకు భారీ ఏర్పాట్లు
●25 నుంచి 27వ తేదీ వరకు మహోత్సవాలు
●భక్తుల కోసం భారీ పందిళ్లు
●కన్వీనర్. రెవరెండ్ జె. శామ్యూల్ కిరణ్
పెదకాకాని: దైవజనులు ఫాదర్ ఎం.దేవదాస్ బయలుపరిచిన బైబిల్ మిషన్ 88వ మహోత్సవాలకు భారీ ఏర్పాట్లు చేసినట్లు బైబిల్ మిషన్ అధ్యక్షులు, మహోత్సవాల కన్వీనర్ రెవరెండ్ జె. శామ్యూల్ కిరణ్ తెలిపారు. సోమవారం ఆయన మాట్లాడుతూ భక్తులకు సకల సదుపాయాలు కల్పించినట్లు చెప్పారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, చత్తీస్‌గడ్, కేరళ, బిహార్, పశ్చిమబెంగాల్ తదితర రాష్ట్రాలతో పాటు ఇతర ప్రాంతాలకు చెందిన భక్తులు ఈ మహాసభకులకు తరలివస్తారన్నారు. అలానే సింగపూర్, మలేషియా, అమెరికా, దుబాయ్ వంటి తదితర దేశాల నుంచి భక్తులు, దేవుని ప్రజలు అత్యంత భక్తిశ్రద్ధలతో మహోత్సవంలో పాల్గొంటారన్నారు. గుంటూరు జిల్లా ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఎదుట బైబిల్ మిషన్ ప్రాంగణంలో సువిశాల పందిరిలో ఈనెల 25వ తేదీ నుంచి 27వ తేదీ మధ్యాహ్నం వరకు మహోత్సవాలు జరుగుతాయి. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు తిరిగి సాయంత్రం 6:00 నుంచి రాత్రి 10 గంటల వరకు దైవ వర్తమానాలు అందిస్తారన్నారు. ఏసుప్రభువు చూపిన ప్రేమ, దయ, జాలి, త్యాగం క్షమాగుణం వంటి లక్షణాలను ప్రతి ఒక్కరూ అలవర్చుకునేందుకు మహోత్సవాల ప్రాంగణం దోహదపడుతుందన్నారు. 26 సంవత్సరాలుగా బైబిల్ మిషన్ మహోత్సవాలను ఆదర్శనీయంగా నిర్వహిస్తున్నామన్నారు. ఈ మహోత్సవాల వైస్ ప్రెసిడెంట్ రెవరెండ్ పి. జాన్ దేవదాసు , సెక్రటరీ రెవరెండ్ కె. ప్రశాంత్ కుమార్ , జాయింట్ సెక్రటరీలు రెవరెండ్ డి. సుధాకర్, రెవరెండ్ జె. ఆగమనరావు , రెవరెండ్ ఎం. రవి, గవర్నింగ్ బాడీ సభ్యులు సారధ్యంలో వివిధ కమిటీల కృషితో ఈ ఏడాది ఆధ్యాత్మిక క్రై స్తవ ఉత్సవాలు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నామని రెవరెండ్ జె.శామ్యూల్ కిరణ్ వివరించారు.
బైబిల్ మిషన్ మహోత్సవాలకు భారీ ఏర్పాట్లు


