మీ అబ్బాయి చదువు మా బాధ్యత..
సాక్షి, అమరావతి: ‘పిల్లలను చదివించుకుంటే వారికి మంచి భవిష్యత్తు ఉంటుంది, కుటుబం కూడా మెరుగైన ప్రయోజనం పొందుతుంది, మీ అబ్బాయిని పనికి కాదు.. బడికి పంపండి. చదివించే బాధ్యతను మేం తీసుకుంటాం’.. ఇది బడి బయటి పిల్లాడి తండ్రితో విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ అన్న మాటలు. సోమవారం ఆయన సమగ్ర శిక్ష ఎస్పీడీ బి.శ్రీనివాసరావుతో కలిసి గుంటూరు జిల్లా మంగళగిరి మండలంలో చినకాకాని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన ‘ఆటిజం సపోర్ట్ సెంటర్’ను పరిశీలించారు. కేంద్రంలో విద్యార్థులను, విద్యార్థుల తల్లిదండ్రులతో ముచ్చటించి సెంటర్ అందిస్తోన్న సేవలను అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలో ఆదే పాఠశాలలో గతంలో చదువుకుని కొద్దిరోజులుగా బడికి రాని ఓ విద్యార్థి గురించి ఆరా తీశారు. ఆ విద్యార్థి బడి మానేసి మెకానిక్ పనికి వెళ్తున్నాడని తెలుసుకున్నారు. వెంటనే ఆ విద్యార్థి తండ్రి నాగమల్లేశ్వరరావును పిలిపించి మాట్లాడగా, ‘చదువు కంటే పని చేసుకుంటే డబ్బులొస్తాయి?’ అని సమాధానమిచ్చారు. అయితే, బడికి వెళ్లి చదువుకుంటే పిల్లాడి భవిష్యత్తు బాగుటుందని, చదువు ద్వారా ప్రయోజనాలను వివరించి కౌన్సెలింగ్ చేశారు. దీంతో రేపటి నుంచి బాబుని బడికే పంపిస్తానని, పనికి పంపనని సదరు విద్యార్థి తండ్రి హామీ ఇచ్చారు. కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి ఓఎస్డీ వెంకట రమణ పాల్గొన్నారు.
బడి మానేసిన విద్యార్థి తండ్రికి
కోన శశిధర్ కౌన్సెలింగ్
మీ అబ్బాయి చదువు మా బాధ్యత..


