రద్దీ వేళ అడ్డగోలు దోపిడీ
గుంటూరు ఆర్టీసీ బస్టాండ్‌లో ప్రయాణికుల జేబులు గుల్ల ఎమ్మార్పీపై విక్రయాలకు దుకాణదారులు తిలోదకాలు పట్టించుకోని ఆర్‌టీసీ, ఫుడ్ సేఫ్టీ, లీగల్ మెట్రాలజీ అధికారులు
బస్టాండు కిటకిట
సంక్రాంతి పండుగకు సొంత గ్రామాలు, నగరానికి వచ్చిన వారు తిరిగి వెళ్లేందుకు బస్టాండుకు రావడంతో ప్రాంగణం ఆదివారం కిటకిటలాడింది. బస్సులు తక్కువగా ఉండటం, సమయానికి రాకపోవటంతో ప్రయాణికులు ఎదురు చూపులు చూశారు. గంటల తరబడి పడిగాపులు తప్పలేదు. ఎక్కాల్సిన బస్సు రాగానే అందులోకి వెళ్లేందుకు నానా తంటాలు పడ్డారు. ముఖ్యంగా బస్సుల్లో ఉచిత ప్రయాణం కావటంతో మహిళల సంఖ్య ఎక్కువగా కనిపించింది. చిన్నారులు, వృద్ధులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, గుంటూరు
సంక్రాంతి పండుగను పురస్కరించుకుని స్వగ్రామాలకు వచ్చిన వారు తిరుగు ప్రయాణం అయ్యారు. గుంటూరు ఆర్టీసీ బస్టాండ్‌లో ప్రస్తుతం సుమారు వంద దుకాణాల వరకు ఉన్నాయి. వీటిలో కనీసం నలభై వరకు కూల్‌డ్రింక్స్, వాటర్ బాటిల్స్, పాప్‌కార్న్, చిప్స్, బిస్కెట్లు, చాక్లెట్లు వంటి తినుబండారాలు విక్రయించే దుకాణాలే. సంక్రాంతి రద్దీని ఆసరాగా చేసుకుని దుకాణాలు నిబంధనలను పూర్తిగా చెత్తబుట్టలో వేసి, ప్రయాణికుల జేబులను గుల్ల చేస్తున్నాయి. ఎమ్మార్పీ అనే పదం మచ్చుకై నా కనపడటం లేదు. అత్యంత ప్రముఖ కంపెనీలు అయిన కిన్‌లే, బెయిలీ, ఆక్వామైన్, బిస్లరీ వంటి కంపెనీల వాటర్ బాటిళ్లపై రూ. 20 ఎమ్మార్పీ ఉంటే.. ఇక్కడ ఆక్సిజెమ్, ఆక్వా ఫ్రెప్‌తోపాటు ఇతర లోకల్ కంపెనీలకు చెందిన వాటర్ బాటిళ్లు నేరుగా రూ. 30 ముద్రించి విక్రయించటం కొసమెరుపు. ప్రముఖ కంపెనీల వాటర్ బాటిళ్లు సైతం డూప్లికేటు తయారు చేయించి విక్రయిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కూల్‌డ్రింక్ చిన్న బాటిల్ అయితే రూ.5, అరలీటర్ రూ.10, లీటర్‌కు రూ.25 వరకు అధికంగా తీసుకుంటున్నారు. ఈ విధంగా విక్రయాలు జరుగుతున్నా.. ఈ పది రోజులలో లీగల్ మెట్రాలజీ అధికారులు కనీస తనిఖీ చేసిన పాపాన పోలేదని తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
పట్నంబజారు: సంక్రాంతి పండుగ కోసం ఊరికి బయలుదేరిన ఓ సాధారణ కుటుంబానికి గుంటూరు ఆర్టీసీ బస్టాండ్‌లో ఎదురైన అనుభవంతో ఇది బస్టాండా.. దోపిడీ అడ్డానా..? అనే ప్రశ్న లేవనెత్తింది. పిల్లల దాహం తీర్చేందుకు రెండు వాటర్ బాటిళ్లు కొనాలనుకున్న ఆ కుటుంబం.. రూ. 20 ఎమ్మార్పీ ఉన్న ఒక్కో బాటిల్‌కు రూ.30 చెల్లించాల్సి వచ్చింది. ఆఖరికి పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే.. స్వయంగా దుకాణదారులు వాటర్ బాటిల్‌పై ముద్రించి విక్రయాలు జరుపుతున్నారు. ప్రశ్నిస్తే దుకాణదారుడి సమాధానం మరింత ఘోరం. ‘‘ఇక్కడ అంతే. కావాలంటే తీసుకోండి, లేకపోతే వదిలేయండి.’’ అని అతడు పేర్కొనడం గమనార్హం. ఇదీ గుంటూరు ఆర్టీసీ బస్టాండ్‌లో నడుస్తున్న దోపిడీ రాజ్యం.
నాణ్యత ప్రశ్నార్థకం
ధరల దోపిడీకి తోడు నాణ్యత లేని, కాలపరిమితికి చేరువైన తినుబండారాలు ప్రయాణికుల చేతిలోకి వెళుతున్నాయి. చిప్స్ ప్యాకెట్లు, బిస్కెట్లు, పాప్‌కార్న్‌లపై అసలు ధరలు లేవు. నిల్వ ఉన్నవి వేడి చేసి అమ్మేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా పిల్లలతో ప్రయాణించే కుటుంబాలకు ఇది నేరుగా ఆరోగ్యంపై ప్రభావం చూపుతోంది. కానీ దుకాణదారులకు లాభం తప్ప ప్రయాణికుల ఆరోగ్యం అవసరం లేనట్టుగా వ్యవహారం సాగుతోంది. బస్టాండ్ బయటకు వెళ్లి కొనుగోలు చేసే అవకాశం లేకపోవడం ప్రయాణికుల బలహీనతగా మారింది. ‘‘బస్టాండ్‌లోనే కొనాలి’’ అనే పరిస్థితిని ఆయుధంగా మార్చుకుని, దుకాణదారులు బహిరంగ దోపిడీకి పాల్పడుతున్నారు. ప్రశ్నించే ప్రయాణికులపై నిర్లక్ష్యపు చూపు, అహంకారపు మాటలే సమాధానంగా మారుతున్నాయి. ఇంత జరుగుతున్నా ఆర్టీసీ అధికారులు, ఫుడ్ సేఫ్టీ అధికారులు, లీగల్ మెట్రాలజీ విభాగం అధికారులు కనీసం స్పందించడం లేదు. బస్టాండ్‌లోని దుకాణాలలో తరచూ తనిఖీలు నిర్వహించాల్సి ఉన్నా పండుగ సమయంలో కూడా కనిపించకపోవడం అనుమానాలకు తావిస్తోంది. నిబంధనలు ఉల్లంఘించిన దుకాణాలపై చర్యలు లేకపోవడం వల్లే ఈ దోపిడీ మరింత పెరుగుతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. సాధారణ ప్రజల అవసరాలను లాభంగా మార్చుకునే ఈ దోపిడీకి ఇకనైనా చెక్ పెట్టాల్సిన అవసరం ఉంది. ధరల నియంత్రణ, నాణ్యత తనిఖీలు, కాలపరిమితి లేని ఆహార పదార్థాల విక్రయాలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ వినిపిస్తోంది.


