కపోతేశ్వరస్వామి సేవలో హైకోర్టు న్యాయమూర్తి
నకరికల్లు: నకరికల్లు మండలం చేజర్ల గ్రామంలోని శ్రీ కపోతేశ్వర స్వామిని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ టి.మల్లికార్జునరావు ఆదివారం దర్శించుకున్నారు. శతాబ్దాల చరిత్ర కలిగిన స్వామి వారిని దర్శించుకొని మొక్కులు చెల్లించారు. ఆయన వెంట నరసరావుపేట అడిషనల్ జూనియర్ సివిల్ న్యాయమూర్తి ఎ.సలోమి ఉన్నారు. వీరికి ఆలయ అర్చకులు కొండకావూరి వెంకట్రామయ్య శర్మ పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. వేదపండితుల ఆశీర్వచనాలు అందించారు. నరసరావుపేట అడిషనల్ జూనియర్ సివిల్ న్యాయమూర్తి ఎ.సలోమి కూడా స్వామి వారిని దర్శించుకున్నారు. ఎస్‌ఐ కె.సతీష్ ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు.
చందోలు(కర్లపాలెం): చందోలు గ్రామంలో వేంచేసియున్న శ్రీబగళాముఖి అమ్మవారిని ఆదివారం హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సుజాత దర్శించుకుని, పూజలు చేశారు. అమ్మవారి ఆలయంలో అమావాస్య సందర్భంగా జరిగిన కుంకుమ పూజలలో జస్టిస్ సుజాత పాల్గొని గుమ్మడి కాయతో దీపారాధన చేసి హారతులిచ్చారు. న్యాయమూర్తికి ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనాలు అందజేయగా, ఈవో నరసింహమూర్తి, ట్రస్ట్‌బోర్డు చైర్మన్ కలకోట చక్రధర్‌రెడ్డి, న్యాయమూర్తికి అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అమావాస్య సందర్భంగా జరిగిన ప్రత్యేక పూజలలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
నరసరావుపేట రూరల్: ఆదివారం అమావాస్యను పురస్కరించుకుని ఇస్సపాలెంలోని మహంకాళి అమ్మవారి ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. అమ్మవారికి విశేష పూజలు, ప్రత్యేక అలంకరణలు నిర్వహించారు. మహిళలు పొంగళ్లు పొంగించి అమ్మవారికి సమర్పించారు. భక్తులతో ఆలయ క్యూలైన్‌లో రద్దీ నెలకొంది. ఆలయంలో నిర్వహించిన చండీహోమం, పూజల్లో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. అమ్మవారిని దర్శించుకుని తీర్థ,ప్రసాదాలు భక్తులు స్వీకరించారు. ఆలయంలో అన్నప్రసాద వితరణ చేశారు. ఆలయ ఈవో నలబోతు మాధవీదేవి ఏర్పాట్లు పర్యవేక్షించారు.
అమృతలూరు(భట్టిప్రోలు): అమృతలూరు మండలం గోవాడ గ్రామంలోని పుణ్య క్షేత్రం శ్రీ గంగాపార్వతి సమేత శ్రీ బాలకోటేశ్వరస్వామి దేవస్థానంలో ఆదివారం పుష్ప అమావాస్య కోటి కుంకుమార్చన, సామూహిక లలిత సహస్ర నామ పారాయణ మహోత్సవం నిర్వహించారు. ఓం నమో భగవతే మలయాళ యాతీన్మాయ సద్గురు మలయాళ స్వాముల సాధురత్నాంబ ఆశీస్సులతో గూడవల్లి ఆధ్వర్యంలో మహా అన్న ప్రసాద వితరణ శ్రీ మైత్రేయాశ్రమంలో ఏర్పాటు చేశారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమంలో కార్యనిర్వహణాధికారి మంతెన విఠల్ శ్రీనివాసవర్మ, చైర్మన్ పావులూరి రమేష్, ఎస్‌ఎస్‌ఎఫ్ బాపట్ల జిల్లా దేవాలయ ప్రముఖ్ పొన్నపల్లి సత్యనారాయణ, జిల్లా ధర్మ ప్రచారక్ జంజనం హేమశంకరరావు, మైత్రేయి ఆశ్రమ నిర్వహకురాలు గంటా నిర్మలమ్మ, ఉప్పల పద్మజ, మండవ నాగమల్లేశ్వరి, ఇంకొల్లు రంగారావు, ఎస్‌ఎస్‌ఎఫ్ నిర్వాహకులు పడమటి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
కపోతేశ్వరస్వామి సేవలో హైకోర్టు న్యాయమూర్తి
కపోతేశ్వరస్వామి సేవలో హైకోర్టు న్యాయమూర్తి
కపోతేశ్వరస్వామి సేవలో హైకోర్టు న్యాయమూర్తి


