దూరవిద్య విభాగంలో కదలిక
ఆరోపణలు ఎదుర్కొన్న అబ్జర్వర్లపై యూనివర్సిటీ చర్యలు కొంతమందిని పరీక్షల విధుల నుంచి తొలగించిన అధికారులు అన్ని సౌకర్యాలు ఉన్న కళాశాలలకే పరీక్ష కేంద్రాలుగా అనుమతి క్యాంపస్‌లో పనిచేసే వారికే అబ్జర్వర్‌గా విధులు కేటాయింపు పరీక్షల వేళ వివాదాస్పదంగా మారిన కోఆర్డినేటర్ తీరు
మంగళగిరి టౌన్: ఈ నెల 17వ తేదీన ‘సాక్షి’లో ప్రచురించిన ‘దూరవిద్యలో అవినీతి దందా’ అనే ప్రత్యేక కథనం ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో తీవ్ర చర్చకు దారితీసింది. దూరవిద్యలో గత పరీక్షల్లో పలు ఆరోపణలు ఎదుర్కొన్న కొందరు అతిథి అధ్యాపకులను తొలగించి వారి స్థానంలో వేరే వారిని అబ్జర్వర్లుగా విధులు కేటాయిస్తున్నట్లు దూర విద్యాకేంద్రం డైరెక్టర్ ప్రొఫెసర్ వంకాయలపాటి వెంకటేశ్వరరావు ఆదివారం ‘సాక్షి’ ప్రతినిధికి తెలిపారు. ఈ కథనానికి స్పందించి అధికారులు శనివారం ప్రత్యేక సమావేశం నిర్వహించినట్లు విశ్వసనీయ సమాచారం. ఈ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నట్లు తెలియవచ్చింది. గతంలో కొంతమంది పరిశీలకులుగా వెళ్లినవారు ఆయా పరీక్షా కేంద్రాల నిర్వాహకులను మభ్యపెట్టి అధిక మొత్తంలో డబ్బులు డిమాండ్ చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో వర్సిటీ పలు చర్యలు తీసుకుంది. పరీక్ష కేంద్రాల కేటాయింపు విషయంలో వర్సిటీ నియమించిన కమిటీ ఆయా కేంద్రాలను పరిశీలించి, అన్ని వసతులు ఉన్న వాటినే ఎంపిక చేసినట్లు ప్రొఫెసర్ వెంకటేశ్వరరావు వెల్లడించారు. ఈ పరీక్షలకు మొత్తం 114 కేంద్రాలను ఎంపిక చేశామని, వాటికి ఒక్కొక్కరు చొప్పున అబ్జర్వర్‌లను నియమించినట్లు పేర్కొన్నారు. పరీక్ష కేంద్రాల్లో ఏదైనా అవకతవకలు జరిగితే అబ్జర్వర్లపై చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని చెప్పారు. వర్సిటీలో పనిచేసే అధ్యాపకులకు మాత్రమే విధులు కేటాయించినట్లు తెలిపారు. ఈ నెల 20వ తేదీ నుంచి ప్రారంభమయ్యే దూరవిద్య పరీక్షలకు యూజీ, పీజీ కోర్సులకు సుమారు 63 వేల మంది విద్యార్థులు హాజరుకానున్నట్లు పేర్కొన్నారు. పరీక్షల నిర్వహణ విధివిధానాలపై సోమవారం పరిశీలకులుగా నియమించిన వారికి ప్రత్యేక సూచనలు చేయనున్నట్లు తెలిపారు.
కో ఆర్డినేటర్ నిర్లక్ష్యం
ఇదిలా ఉండగా పరీక్షలు దగ్గర పడుతున్న సమయంలో దూరవిద్య కేంద్రంలో కీలకంగా వ్యవహరించే కో ఆర్డినేటర్ సెల్‌ఫోన్ స్విచ్ఛాఫ్ రావడంతో ఆయా కేంద్రాల నిర్వాహకులు, పరిశీలకులు ఆందోళన చెందుతున్నట్లు సమాచారం. వర్సిటీలో విద్యార్థి కాని మంగళగిరికి చెందిన ఓ వ్యక్తికి గత పరీక్షల్లో పరిశీలకులుగా కృష్ణా జిల్లాలో నియమించినట్లు సమాచారం. అయితే గతంలో ఆరోపణలు ఎదుర్కొన్నవారిలో పలువురిని మాత్రమే తొలగించి, మిగిలిన వారిని కొనసాగించారని బహిరంగంగా వ్యాఖ్యానిస్తున్నారు. వీటన్నింటికీ యూనివర్సిటీలో పలువురు కీలకపదవుల్లో ఇన్‌చార్జులుగా ఉండటమే కారణమని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కొంతమందికి విధులు కేటాయించినా హాజరు కాకుండా రెండుమూడు రోజులు ఎక్కడో ఉంటున్నట్లు విశ్వసనీయ సమాచారం. దూరవిద్య కేంద్రం వ్యవహారాలను గాడిలో పెట్టాలని విద్యార్థులు, మేధావులు కోరుతున్నారు. వివరణ కోరేందుకు కో ఆర్డినేటర్‌కు పలుమార్లు ఫోన్ చేయగా స్విచ్ఛాఫ్ వచ్చింది.
దూరవిద్య విభాగంలో కదలిక


