ఏసీ మెకానిక్ హత్యకేసులో ఐదుగురు అరెస్ట్
తెనాలిరూరల్: పట్టణంలో ఇటీవల జరిగిన ఏసీ మెకానిక్ హత్య కేసులో ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ వివరాలను త్రీ టౌన్ సీఐ ఎస్.సాంబశివరావు ఆదివారం రాత్రి వెల్లడించారు. పట్టణ నందులపేటకు చెందిన షేక్ ఫయాజ్ అహ్మద్‌కు 2016లో వ్యభిచార వృత్తిలో ఉన్న పల్లప్రోలు హిమబిందు అలియాస్ మాధవి పరిచయమైంది. అప్పటి నుంచి ఆమె వద్దకు వెళుతూ ఆమె వ్యభిచార వృత్తికి సహకరించేవాడు. హిమబిందుకు గుంటూరుకు చెందిన జొన్నకూటి క్రాంతికిరణ్‌తో 2016కు ముందే పరిచయముంది. ఇద్దరూ కలసి వ్యభిచార వృత్తి నిర్వహిస్తూ ఉండేవారు. ఫయాజ్‌తో పరిచయమయ్యాక హిమబిందు వ్యభిచారం చేస్తూ పట్టుబడి జైలుకు వెళ్లింది. తనకు బెయిలు ఇప్పించకపోవడం, తన వద్దే డబ్బులు తీసుకుంటుండడంతో హిమబిందు తిరిగి తనకు గతంలోనే పరిచయమున్న క్రాంతికిరణ్‌తో ఫోన్‌లో మాట్లాడడం చేస్తోంది. ఇది గమనించిన ఫయాజ్ ఆమెను హెచ్చరించాడు. ఫయాజ్‌ను అడ్డు తొలగించుకుని తాము ఇద్దరం కలసి వ్యభిచార వృత్తిని కొనసాగించుకోవచ్చని హిమబిందు, క్రాంతికిరణ్ నిర్ణయానికి వచ్చారు. ఈ నేపధ్యంలో ఈ నెల 9వ తేదీ సాయంత్రం ఆరు గంటలకు ఫయాజ్ హిమబిందు ఇంటికి వస్తున్నానని ఫోన్ చేసి వెళ్లాడు. ఇదే విషయాన్ని హిమబిందు క్రాంతికిరణ్‌కు చేరవేసింది. రాత్రి వరకు ఫయాజ్ అక్కడే ఉంటాడని తెలిసిన క్రాంతికిరణ్, మారిస్‌పేట సీఎం కాలనీకి చెందిన షేక్ నాగూర్‌వలి అలియాస్ చోటు, కమాదుల జయంత్, ఉప్పు రంగారావులతో ఫయాజ్‌ను హత్యచేస్తే రూ. 10 వేలు ఇస్తానని ఒప్పించి తన వెంట తీసుకెళ్లాడు. రాత్రి 9.30 గంటల ప్రాంతంలో ఫయాజ్ ఇంటి నుంచి బయలుదేరగా అదే విషయాన్ని హిమబిందు క్రాంతికిరణ్‌కు చేరవేసింది. ఇంటి సమీపంలోనే మాటు వేసి ఉన్న నిందితులు ఫయాజ్‌పై కర్రలు, సిమెంటు రాయితో దాడి చేసి హతమార్చారు. న్యాయవాది ద్వారా లొంగిపోదామని నిందితులు వస్తున్న సమాచారం అందడంతో వారిని అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి ఐదుగురు నిందితులకు 15 రోజులు రిమాండ్ విధించినట్టు సీఐ తెలిపారు. ఆయన వెంట ఎస్‌ఐలు ప్రకాశరావు, కరిముల్లా ఉన్నారు.
సహజీవనం చేస్తున్న మహిళ మాజీ ప్రియుడితో కలిసి అంతమొందించిన వైనం


