వక్ఫ్‌భూములు ఇతర అవసరాలకు మళ్లించడానికి వీల్లేదు
తెనాలి: వక్ఫ్ భూములు ముస్లిం సమాజానికి కాకుండా ఇతర అవసరాలకు ఉపయోగించటానికి వీల్లేదని ఏపీ ముస్లిం యునైటెడ్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షుడు ఎండీ కలీం స్పష్టంచేశారు. ఆంధ్రప్రదేశ్ ముస్లిం యునైటెడ్ ఫ్రంట్, గుంటూరు పార్లమెంటు కమిటీ విస్తృతస్థాయి సమావేశం ఆదివారం మారీసుపేటలోని కాంగ్రెస్‌పార్టీ సమావేశ మందిరంలో జరిగింది. ఫ్రంట్ పార్లమెంట్ కన్వీనర్ షేక్ ఖలీల్ అధ్యక్షత వహించారు. గుంటూరు ఈస్ట్, వెస్ట్, తాడికొండ, ప్రత్తిపాడు, పొన్నూరు, మంగళగిరి, తెనాలి నియోజకవర్గాల నాయకులు పాల్గొన్నారు. వక్ఫ్ భూములను ఇతర అవసరాలకు వినియోగించరాదనీ, బలవంతంగా స్వాధీనం చేసుకోరాదని తీర్మానం చేశారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో చేసిన వాగ్దానం ప్రకారం ముస్లిం అమ్మాయిల పెళ్లికి రూ.లక్ష, రంజాన్ పండుగకు తోఫా, మైనారిటీ రుణాలు వెంటనే అమలుచేయాలని కోరుతూ తీర్మానం చేశారు. 45 వేల ముస్లిం జనాభా ఉన్న తెనాలిలో ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీ ఏర్పాటుచేయాలని, రానున్న పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు ముస్లింలకు అధిక సీట్లను కేటాయించాలని కోరుతూ తీర్మానం చేశారు. బంగ్లాదేశ్‌లోని మైనారిటీ మతస్తుల హక్కులను కాపాడాలని తీర్మానించారు. సమావేశంలో అంతర్జాతీయ పవర్‌లిఫ్టర్ షేక్ షబీనాకు ఆర్థికసాయం అందజేశారు. ముస్లిం యునైటెడ్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షుడు ఎండీ కలీంతోపాటు గౌస్ బాషా, ఆదంసాహెబ్, కరిముల్లా, మెమన్‌బాషా, మాజీ ఎంపీటీసీ కరిముల్లాఖాన్, బాబా రహీమ్‌ఖాన్, కరిముల్లాఖాన్, జమయతుల్ ఉల్మా, షబ్బీర్‌బాషా, ఖాజి అబ్దుల్ రవూఫ్, నాగూర్, మస్తాన్ షరీఫ్, షంషుద్దీన్, దావూద్, జానిబాషా, షేక్ సలాం పాల్గొన్నారు.
ఏపీ ముస్లిం యునైటెడ్ ఫ్రంట్
రాష్ట్ర అధ్యక్షుడు ఎండీ కలీం


