సంస్కతి, సంప్రదాయాలకు ప్రతిబింబాలు నాటికలు
యద్దనపూడి: మన సంస్కతి, సంప్రదాయాలతోపాటు సమాజంలోని వాస్తవ పరిస్థితులను కళ్లకు కట్టినట్టు చూపించే ప్రతిబింబాలే నాటికలని తెలుగు టీవీ, నిర్మాతల మండలి అధ్యక్షుడు ఆరెకట్ల ప్రసాద్ పేర్కొన్నారు. మండలంలోని అనంతవరం గ్రామంలో ఎన్టీఆర్ కళాపరిషత్ ఆధ్వర్యంలో నాలుగో ఉభయ తెలుగురాష్ట్రాల నాటిక పోటీలు మూడో రోజు పోటీలను ఎన్టీఆర్ పురస్కార గ్రహీత డాక్టర్ ముత్తవరపు సురేష్‌బాబు దంపతులు ప్రారంభించారు. ఆరెకట్ల ప్రసాద్ మాట్లాడుతూ.. సమాజాన్ని మేల్కోల్పటంలో నాటికలు కీలకపాత్ర పోషిస్తాయన్నారు. నాటికల్లోని పాత్రల్లో ప్రేక్షకులు తమను తాము చూసుకోవటం ద్వారా సామాజిక చైతన్యం పెరుగుతుందన్నారు. చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ సమాజంలోని రుగ్మతలను రూపుమాపటానికి నాటక ప్రదర్శనలు ఎంతగానో దోహదపడతాయని పేర్కొన్నారు. ప్రఖ్యాత టీవీ దర్శకులు మలినేని రాధాకృష్ణ మాట్లాడుతూ నాటకాల ద్వారా సమాజానికి ఉపయోగపడే సందేశాత్మక అంశాలు ఎన్నో మిళితమై ఉంటాయన్నారు. కార్యక్రమంలో ప్రకాశం జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ముప్పవరపు సుచరిత, సీఆర్ క్లబ్ కార్యదర్శి పావులూరి శ్రీనివాసరావు, అనంతవరం ఎన్టీఆర్ కళాపరిషత్ నిర్వాహకులు గుదే పాండురంగారావు, గుదే తారక రామారావు, కొరిటాల వంశీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
అలరించిన నాటికలు..
తొలి నాటికగా విజయవాడ సాంస్కృతిక సమితి వారి మమ్మల్ని బతకన్విండి, రెండో నాటికగా అభినయ ఆర్ట్స్ గుంటూరు వారిచే ఇది అతని సంతకం, ఉషోదయ కళానికేతన్ కట్రపాడు వారిచే మంచి మనస్సులు నాటికలు ఆహుతులను అలరించాయి.
సంస్కతి, సంప్రదాయాలకు ప్రతిబింబాలు నాటికలు


