కేఎల్‌యూలో బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ప్రారంభం
తాడేపల్లి రూరల్: తాడేపల్లి రూరల్ వడ్డేశ్వరంలోని కేఎల్ యూనివర్సిటీలో శనివారం అఖిల భారత అంతర్ విశ్వవిద్యాలయాల పురుషుల బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ప్రారంభమైనట్లు వర్సిటీ వీసీ డాక్టర్ పార్ధసారధి వర్మ తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ డైరెక్టర్ ఎస్.సంతోష్‌కుమార్ విచ్చేసి టోర్నమెంట్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువ క్రీడాకారులు తమ ప్రతిభను ప్రదర్శించడానికి, జాతీయస్థాయి ఇంటర్ యూనివర్సిటీ చాంపియన్‌షిప్‌కు అర్హత సాధించడానికి ఈ టోర్నమెంట్ ఒక గొప్ప అవకాశమన్నారు. వర్శిటీ వీసీ డాక్టర్ పార్ధసారధి వర్మ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఉన్న నాలుగు జోన్లలో విజేతలైన జట్లు ఒక్కో జోన్‌కు నాలుగు జట్ల చొప్పున మొత్తం 16 విశ్వవిద్యాలయాల నుంచి 16 జట్లు పాల్గొన్నాయని తెలిపారు. శనివారం నుంచి మూడు రోజలు పాటు జరిగే టోర్నమెంట్‌లో క్రీడాకారులకు అన్ని రకాల వసతి, భోజనం, వైద్య సదుపాయాలు ఏర్పాటు చేశామని తెలిపారు. కేఎల్‌యూ క్రీడల డైరెక్టర్, సౌత్‌జోన్ బ్యాడ్మింటన్ ఆర్గనైజింగ్ సెక్రటరి డాక్టర్ కె.హరికిషోర్ మాట్లాడుతూ తొలిరోజు 16 జట్లు ఆడిన తరువాత కేఐఐటీ యూనివర్సిటీ ఒడిశాపైన బెంగళూరుకు చెందిన జైన్ యూనివర్శిటీ విజయం సాధించిందని, దీన్‌దయాళ్ ఉపాధ్యాయ యూనివర్సిటీపై యూనివర్సిటీ ఆఫ్ కాళికట్ విజయం సాధించిందని, వీటితో పాటు మరో ఆరు జట్లు విజేతలుగా నిలిచాయని ఆదివారం నాడు ఎనిమిది జట్లు తలపడనున్నాయని తెలిపారు. కార్యక్రమంలో ఆలిండియా యూనివర్సిటీల పరిశీలకులు డాక్టర్ కిరణ్, వర్సిటీ వీసీలు డాక్టర్ ఏవీఎస్ ప్రసాద్, డాక్టర్ ఎన్.వెంకట్‌రామ్, డాక్టర్ కె.రాజశేఖరరావు, రిజిస్ట్రార్ డాక్టర్ కె.సుబ్బారావు, విద్యార్థి సంక్షేమ విభాగం ఇన్‌చార్జి డీన్ డాక్టర్ కేఆర్‌ఎస్ ప్రసాద్, వ్యాయామ అధ్యాపకులు పాల్గొన్నారు.


