రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి
మంగళగిరి టౌన్ : మంగళగిరిలో శుక్రవారం రాత్రి రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందగా, మరో యువకుడికి తీవ్ర గాయాలు అయ్యాయి. సేకరించిన వివరాల మేరకు మంగళగిరి పట్టణం ఇందిరానగర్‌లో నివాసముంటున్న పెండెం రామకృష్ణ బంగారపు పనిచేసుకుంటూ భార్య, కుమారుడు, కుమార్తెతో జీవనం సాగిస్తున్నాడు. కుమారుడు జయంత్ బవన్ (21) బీబీఏ పూర్తిచేసి ప్రస్తుతం ఇంటివద్దనే ఉంటున్నాడు. సంక్రాంతి పండుగకు స్నేహితులో కలసి బయటకు వెళుతున్నాని చెప్పి శుక్రవారం సాయంత్రం కారు తీసుకుని వెళ్ళాడు. శుక్రవారం రాత్రి సమయంలో తమ కుమారుడు జయంత్‌తో పాటు అతని స్నేహితుడు నాగార్జున విజయవాడ వైపు నుంచి గుంటూరు వెళుతుండగా మంగళగిరి లక్ష్మీ నరసింహ స్వామి కాలనీ సమీపంలో జాతీయ రహదారిపై కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. కారు పల్టీలు కొడుతూ రోడ్డుకు అవతలవైపు పడింది. దీంతో కారు డ్రైవ్ చేస్తున్న జయంత్ తలకు బలమైన గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు 108కు, పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు జయంత్ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఎన్‌ఆర్‌ఐ ఆసుపత్రికి తరలించగా, స్నేహితుడు నాగార్జునకు తీవ్ర గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం సమీపంలోని మణిపాల్ హాస్పిటల్‌కు తరలించారు. జరిగిన ఘటనపై మంగళగిరి పట్టణ ఎస్‌ఐ శ్రీహరిబాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


