రైతు గుండైపె ఓఆర్‌ఆర్
పరిశీలిస్తామని కలెక్టర్ అంటున్నారు
● ఆదుకుంటారనుకుంటే
ఆడుకుంటున్నారు...
● కనీస సమాచారం కూడా
ఇవ్వకుండా నోటీస్ బోర్డుల్లో పెట్టారు
● మార్కెట్ విలువలో పదోవంతు
కూడా రాదు
● నిన్న నారాకోడూరు, నేడు
మేడికొండూరు మండలం
డోకిపర్రు రైతుల ఆందోళన
● డోకిపర్రులో ఔటర్ రింగ్ రోడ్డు
పేరుతో 365 ఎకరాలు సేకరణ
● పాస్ పుస్తకాలు కోసం వెళ్లిన
రైతులకు షాక్ ఇచ్చిన అధికారులు
● గుంటూరు కలెక్టరేట్‌కు పెద్దఎత్తున
తరలి వచ్చిన రైతులు
సాక్షి ప్రతినిధి, గుంటూరు/గుంటూరు వెస్ట్: రాజధాని చుట్టూ రాష్ట్ర ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన ఓఆర్‌ఆర్ భూసేకరణ రైతులపై పిడుగులా పడింది. కనీసం గ్రామ సభలు కూడా నిర్వహించకుండా సచివాలయాల్లో సమాచారాన్ని అతికించి వదిలివేయడంతో రైతులు గగ్గోలు పెడుతున్నారు. రైతులకు ఒరగబెట్టింది ఏమీ లేకపోగా ఉన్న భూములను కూడా లాక్కుని రైతుల నోట్లో మట్టి కొట్టి రోడ్లపైకి లాగుతున్నారని వాపోతున్నారు. చడీచప్పుడు లేకుండా కనీసం పొలం సరిహద్దుకు కూడా తెలీకుండా రైతుల భూములను లాక్కునే ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ఇటీవల చేబ్రోలు మండలం, నారాకోడూరు రైతులకు సంబంధించిన భూముల విషయంలో ఇదే జరిగింది.
తాజాగా మేడికొండూరు మండలం డోకిపర్రు గ్రామ రైతులు శనివారం గుంటూరు కలెక్టరేట్‌కు పెద్ద ఎత్తున చేరుకుని నిరసన వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియాకు వినతిపత్రం అందజేశారు. పేరేచర్ల–మేడికొండూరు మధ్యలో ఉన్న డోకిపర్రు గ్రామంలో 365 ఎకరాల భూమిని ఔటర్ రింగ్ రోడ్డు కోసం సేకరిస్తున్నట్లు తెలుసుకున్న రైతులు ఆగమేఘాలపై తమకు జరుగుతున్న అన్యాయాన్ని ముక్తకంఠంతో తెలిపేందుకు సిద్ధమయ్యారు.
ఏదో ఒరగబెడతారని అందరూ చంద్రబాబు సర్కారును గద్దెనెక్కిస్తే చివరికి మా నోటి దగ్గర కూడు లాక్కోవడం దారుణమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భూమి కోల్పోతున్న రైతులకు రూ.20–30 లక్షల మధ్యలో నష్టపరిహారం ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమయ్యింది. వాస్తవానికి ఇక్కడ కమర్షియల్ భూమి విలువ రూ.2 కోట్లు నుంచి రూ.2.5 కోట్లు మధ్యలో నడుస్తుంది. ఓఆర్‌ఆర్‌కు భూమి ఇచ్చేందుకు రైతులు సంసిద్ధత వ్యక్తం చేస్తున్నారు. కాని ప్రభుత్వం తమకిచ్చే పరిహారం విషయంలో తమకు జరిగే అన్యాయాన్ని ఎట్టిపరిస్థితిలో అంగీకరించేది లేదని తెగేసి చెబుతున్నారు.
చడీచప్పుడు కాకుండా కాజేసేందుకు స్కెచ్ ...
సుమారు 350 మంది రైతుల జీవితాలు ఆగమవుతుంటే తనకేమీ తెలియదని తాడికొండ ఎంఎల్‌ఏ తెనాలి శ్రావణ్ కుమార్ అంటున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. మొదట విడత గెజిట్‌లో 70 మీటర్ల రోడ్డుగా నమోదు చేశారు. దానిని 140 మీటర్లుగానూ ఇప్పుడు అవీ ఇవీ కలుపుకుని ఇప్పుడు 250 మీటర్ల ఓఆర్‌ఆర్ అవసరమని అధికారులు తేల్చారు. వాస్తవానికి ఇంత వెడల్పున రోడ్డు రాష్ట్రంలో ఎక్కడాలేదు. ఇటీవల ప్రభుత్వం భూమి ఉన్న రైతులకు పాస్‌పుస్తకాలు అందజేసింది. దీంతో నాలుగు రోజుల క్రితం పాస్‌బుక్స్ తీసుకునేందుకు సచివాలయానికి వెళితేగాని వారికి అస్సలు విషయం అర్థం కాలేదు. తనకున్న రెండు ఎకరాలు ఓఆర్‌ఆర్ కింద తీసుకునేందుకు అధికారులు నోటీసు బోర్డులో అతికించేసరికి ఒక్కసారిగా షాక్‌కు గురి అయినట్లు డోకిపర్రుకు చెందిన గట్టు సుబ్బారావు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.
జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియాను కలిసి మా ఇబ్బందులు చెప్పుకున్నాం. అక్కడకు అధికారులను పంపి విచారించి న్యాయం చేస్తామంటున్నారు. అసలు రైతులకు తెలీయకుండా ఈ భూములను తీసుకోవడమేంటో అఽర్థం కావడంలేదు. రైతులు ఏమీ చేయలేరనే ధీమా ప్రభుత్వానికి ఉంది.
– కె.సుబ్రమణ్యం,
డోకిపర్రు
రైతు గుండైపె ఓఆర్‌ఆర్


