నృసింహుని ఆలయంలో సంక్రాంతి శోభ
మంగళగిరి టౌన్: మంగళగిరిలో వేంచేసి యున్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో గురు, శుక్రవారాల్లో సంక్రాంతి పండుగ శోభ సంతరించుకుంది. భక్తులు స్వామిని దర్శించుకునేందుకు పోటెత్తారు. ధ్వజస్తంభం వద్ద దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం నృసింహస్వామిని దర్శించుకునేందుకు క్యూలైన్లలో బారులు తీరారు. స్వామి దర్శనానంతరం రాజ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయంలో ఏర్పాటు చేసిన గంగిరెద్దుల విన్యాసాలు భక్తులను ఆకట్టుకున్నాయి. భక్తులు గంగిరెద్దులకు పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ కార్యనిర్వహణాధికి కె. సునీల్ కుమార్ ప్రత్యేక ఏర్పాటు చేసి పర్యవేక్షించారు.
భక్తిశ్రద్ధలతో పారువేట ఉత్సవం..
ఘనంగా గోపూజ
మంగళగిరి టౌన్ : మంగళగిరి పట్టణంలో వేంచేసి యున్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి పారువేట ఉత్సవం శుక్రవారం సాయంత్రం భక్తిశ్రద్ధలతో అత్యంత వైభవంగా నిర్వహించారు. తొలుత ఆలయంలో గోపూజ చేశారు. గోపూజ అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు ఆలయం నుంచి స్వామి వారి పారువేట ఉత్సవం ప్రారంభమయ్యింది. స్వామివారితో గిరి ప్రదక్షణ చేశారు. గిరి ప్రదక్షణ ఆలయం నుంచి ప్రారంభమై గౌతమ బుద్ధ రోడ్, ఎయిమ్స్ హాస్పిటల్ మీదుగా స్వామివారి కొండచుట్టూ సాగి నాలుగుకాళ్ల మండపం మీదుగా తెనాలి రోడ్డు, వడ్లపూడి సెంటర్, మిద్దె సెంటర్ మీదుగా తిరిగి దేవస్థానం వద్దకు చేరుకుంది. ఆయా ప్రాంతాల్లో పారువేట ఉత్సవంలో ఉన్న స్వామివారిని భక్తులు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఆలయ కార్యనిర్వహణాధికి కె. సునీల్‌కుమార్ ఏర్పాట్లను పర్యవేక్షించి పారువేట ఉత్సవంలో పాల్గొన్నారు.
స్వామి, అమ్మవార్ల వస్త్రాలు వేలం
మంగళగిరి టౌన్ : మంగళగిరి పట్టణంలో వేంచేసి యున్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో రెండు రోజుల పాటు అధికారులు భక్తులు సమర్పించిన వస్త్రాలకు బహిరంగ వేలం నిర్వహించారు. బుధ, గురు వారాల్లో జరిగిన వేలం పాటలో సుమారు వెయ్యిమందికిపైగా భక్తులు పాల్గొన్నారు. సుమారు 200 వస్త్రాలను విక్రయించగా మొదటి రోజు రూ. 25,800లు, రెండవ రోజు రూ. 27,200లు మొత్తం రూ. 53,000లు ఆదాయం వచ్చినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి కె. సునీల్ కుమార్ శుక్రవారం తెలియజేశారు.
పోటెత్తిన భక్తులు
నృసింహుని ఆలయంలో సంక్రాంతి శోభ


