ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్ ఆవరణలో మంటలు
తాడేపల్లి రూరల్: తాడేపల్లి పట్టణ పరిధిలోని 16వ నెంబర్ జాతీయ రహదారి మధ్యలో కనకదుర్గ వారధి వద్ద ఉన్న ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్ ఆవరణలో ఒక్కసారిగా శుక్రవారం మంటలు చెలరేగాయి. ఆ మంటల్లో వివిధ కేసుల్లో వున్న 12 ద్విచక్ర వాహనాలు పూర్తిగా దగ్ధం కాగా, ఒక ద్విచక్ర వాహనం పాక్షికంగా దగ్ధమయింది. ఉదయం 11 గంటల సమయంలో ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్ వెనుకభాగంలో ఎండిపోయిన గడ్డి ఉన్న ప్రాంతంలో ఈ మంటలు చెలరేగాయి. జాతీయ రహదారికి సంబంధించిన విద్యుత్‌లైట్లు ఆపరేట్ చేసేందుకు విద్యుత్‌వైర్లు ఉన్నాయి. కనకదుర్గ వారధి వద్ద ఈ పోలీస్‌స్టేషన్ ఆవరణ ప్రహరీ అడ్డులేకుండా, జాతీయ రహదారి సేఫ్టీ గ్రిల్స్ మాత్రమే ఉన్నాయి. ఎవరైనా పొరపాటున సిగరెట్ తాగి విసిరివేస్తే మంటలు చెలరేగాయా? లేదా అక్కడ వున్న విద్యుత్‌వైర్లు షార్ట్ సర్క్యూట్ కావడంతో మంటలు చెలరేగాయా అనే విషయాన్ని పోలీసులు నిర్ధారించలేకపోతున్నారు. అదే సమయంలో పారిశుద్ధ్య కార్మికులు అక్కడ ఉండడంతో వారిని కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. అప్రమత్తమైన పోలీస్ సిబ్బంది అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ద్విచక్రవాహనాలకు ఉన్న టైర్లు, సీట్లు, పెట్రోల్ ట్యాంకులు తగలబడి పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో సిబ్బంది అక్కడే ఉన్న వాటర్ పాండ్‌లో నుంచి బకెట్‌లలో నీళ్లు తీసుకువచ్చి మంటలను అదుపుచేశారు. జరిగిన సంఘటనపై ట్రాఫిక్ పోలీసులు, తాడేపల్లి పోలీసులు విచారణ చేపట్టారు.
వివిధ కేసుల్లో ఉన్న 12 బైక్‌లు దగ్ధం
వారధి వద్ద ఉన్న స్టేషన్‌లో ఘటన


