ఎడ్ల పందేలు చూసేందుకు వెళ్తూ అనంత లోకాలకు..
బైక్‌లు ఢీకొన్న ఘటనలో వ్యక్తి మృతి
చిలకలూరిపేటటౌన్: వినోదం కోసం వెళ్తున్న ఆ ప్రయాణం విషాదాంతమైంది. ఎడ్ల పందేల సందడిని చూడాలన్న కుతూహలం ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. కొత్తగా నిర్మిస్తున్న జాతీయ రహదారిపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నాదెండ్ల మండలం అప్పాపురం గ్రామానికి చెందిన గాండ్రు వేణుగోపాల కృష్ణ ప్రస్తుతం చిలకలూరిపేట పట్టణంలోని పండరీపురంలో నివసిస్తున్నారు. సంక్రాంతి సంబరాల్లో భాగంగా అన్నంబోట్లవారిపాలెంలో జరుగుతున్న ఎడ్ల పందేలను చూసేందుకు ఆయన శనివారం తన బుల్లెట్‌పై బయలుదేరారు. పసుమర్రు గ్రామ పరిధిలోని లక్ష్మి లలిత కోల్డ్ స్టోరేజ్ సమీపానికి చేరుకోగానే, ఎదురుగా అన్నంబోట్లవారిపాలెం వైపు నుంచి వస్తున్న బైక్ వేగంగా వచ్చి బుల్లెట్‌ను బలంగా ఢీకొట్టింది. దీంతో వేణుగోపాలకృష్ణ(48) రోడ్డుపై పడిపోగా, తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. సమాచారం అందుకున్న చిలకలూరిపేట రూరల్ ఎస్‌ఐ జి.అనిల్ కుమార్ వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతుడి భార్య దీప్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చిలకలూరిపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. పండుగ పూట ఇంట యజమాని మృతి చెందడంతో పండరీపురంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.


