దూరవిద్యలో అవినీతి దందా | - | Sakshi
Sakshi News home page

దూరవిద్యలో అవినీతి దందా

Jan 17 2026 8:52 AM | Updated on Jan 17 2026 8:52 AM

దూరవిద్యలో అవినీతి దందా

దూరవిద్యలో అవినీతి దందా

అక్రమంగా రూ.లక్షలు వసూలు చేస్తున్న సిబ్బంది నిబంధనలు పక్కన పెట్టి అడ్డగోలుగా వ్యవహారాలు నానాటికీ మసకబారుతున్న ఏఎన్‌యూ ప్రతిష్ట

సంఘాల వారూ పరిశీలకులే...

పరీక్ష కేంద్రాల పేరుతో నగదు దండుకోవాలన్నా... పీసీసీల పేరుతో సొమ్ము స్వాహా చేయాలన్నా దూరవిద్యలో కొందరు నాన్‌ టీచింగ్‌ సిబ్బందికి వెన్నతో పెట్టిన విద్యగా మారింది. పరీక్ష కేంద్రాల యాజమాన్యాలు సదరు సిబ్బందిని ప్రసన్నం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. హోటల్‌కు వచ్చి ముడుపులు ఇచ్చుకోవాలని సిబ్బంది చెబుతున్న తీరు వివాదాస్పదంగా మారింది. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ఈ దుస్థితి నెలకొంది.

మంగళగిరి టౌన్‌: దూరవిద్య కేంద్రంలో కొందరు నాన్‌ టీచింగ్‌ ఉద్యోగులు షాడో అధికారులుగా వ్యవహరిస్తున్నారు. ఉన్నతాధికారి తన జేబులో మనిషి అని, ఎంపీ బంధువునని, ఒక అధికారికి అత్యంత సన్నిహితుడినని ఓ ఉద్యోగి బెదిరిస్తూ బేరసారాలు చేస్తున్నట్లు సమాచారం. మహిళా ఉద్యోగి ఒకరు కూడా దూరవిద్య కేంద్రంలో సర్వం తానే అన్నట్లు వ్యవహరిస్తున్న తీరు విమర్శలకు తావిస్తోంది. సైన్స్‌ కళాశాలకు చెందిన ఒక అతిథి అధ్యాపకుడు కూడా ఒక అధికారి మనిషినని, స్కాలర్‌ను అంటూ బెదిరిస్తున్నారు. పరీక్ష కేంద్రాల కేటాయింపు, పీసీసీల వసూళ్లు, బఫర్ల అమ్మకాలు, పరిశీలకులకు కమీషన్ల ప్రాతిపదికన నియమించడంలో వీరే కీలకంగా వ్యవహరిస్తున్నట్లు సమాచారం.

అడ్డగోలుగా దోపిడీ

దూరవిద్యలో కొందరు నాన్‌టీచింగ్‌ ఉద్యోగుల అవినీతికి అడ్డే లేకుండా పోయింది. గతంలో సస్పెండ్‌ అయ్యి, పోలీసు విచారణ ఎదుర్కొన్న ఒక ఉద్యోగి దూరవిద్య అవినీతిలో కీలక వ్యక్తిగా మారినట్లు సమాచారం. ఇటీవల ఒక ఉన్నతాధికారికి సన్మానం పేరిట వివిధ సెంటర్ల నుంచి ఖర్చు పేరుతో రూ.లక్షలు వసూలు చేసినట్లు వెలుగులోకి రావడం, ఇతనిపై అధికార పార్టీలోని ఒక వర్గం శాసనసభ్యునికి ఫిర్యాదు అందినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. వర్సిటీలోని ఒక బీసీ వర్గానికి చెందిన ఉద్యోగి కూడా తనను కులం పేరుతో దూషించారంటూ పెదకాకాని పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ఇటీవల జరిగిన దూరవిద్య పరీక్షల్లో సైన్స్‌ కళాశాలకు చెందిన ఒక అతిథి అధ్యాపకుడు చీరాల, బాపట్లలో స్టడీ సెంటర్లలో బినామీగా వ్యవహరించినట్లు విశ్వసనీయ సమాచారం. గతంలో ఈ వ్యక్తి నకిలీ రిలీవింగ్‌ ఇప్పించిన స్కాలర్‌కు రాయలసీమలో దేహశుద్ధి చేశారనే ఆరోపణలు ఉన్నాయి. వర్సిటీలోనే ఒక హాస్టల్‌ కేంద్రంగా ఈ దందా సాగిస్తున్నట్లు సమాచారం. సైన్సు కళాశాలలో గత వీసీ హయాంలో జీతాల పెంపుదల చేయించుకున్న ఒక అతిథి అధ్యాపకుడు... తూర్పు గోదావరి, ఉత్తరాంధ్రలో ఒక సెంటర్‌లో గత పరీక్షల్లో పరిశీలకుడిగా వెళ్లి రూ. 11 లక్షలు వసూలు చేసినట్లు కొంతమంది ఆరోపిస్తున్నారు.

సమావేశం ఏర్పాటు.....

ఈ నెల 20వ తేదీ నుంచి ఆచార్య నాగార్జున యూనివర్సిటీ దూరవిద్య పరీక్షలు జరుగనున్నాయి. ఈ నేపథ్యలో దూరవిద్య కేంద్రం డైరెక్టర్‌ వంకాయలపాటి వెంకటేశ్వరరావు, పరీక్షల కో ఆర్డినేటర్‌ రామచంద్రన్‌లు సోమవారం పరీక్ష కేంద్రాల చీఫ్‌ సూపరింటెండెంట్‌లకు వర్సిటీలో సమావేశం నిర్వహించారు. గతంలో అవకతవకలు జరిగిన పరీక్ష కేంద్రాలనే కొనసాగిస్తారా? లేదంటే మారుస్తారా? అనేది వేచి చూడాలి. ఈ విషయమై వివరణ కోరేందుకు పరీక్షల కో ఆర్డినేటర్‌ రామచంద్రన్‌కు ఫోన్‌ చేయగా ఆయన స్పందించలేదు.

దూరవిద్య కేంద్రంలో అక్రమాల వెలుగు చూడకుండా ఉండడానికి కొన్ని విద్యార్థి సంఘాల నాయకులకు తాయిలాలు ఇస్తున్నట్లు తెలిసింది. కొందరు నాన్‌ టీచింగ్‌ సిబ్బందికి, వారి బంధువులకు విధులు కేటాయిస్తూ పరీక్షల నిబంధనలకు పాతర వేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అనుబంధ కళాశాలల అధ్యాపకులంటూ రాజకీయ నిరుద్యోగులకు రూ.లక్షలు వచ్చేలా కేంద్రాలను కేటాయిస్తున్నారు. దూరవిద్యలో తిష్టవేసిన ఒక అవినీతి బాబు, ఒక సైన్స్‌ అతిథి అధ్యాపకుడు కమీషన్లు తీసుకుని పరిశీలకుల నియామకంలో కీలకంగా వ్యవహరిస్తున్నట్లు సమాచారం. ఉన్నతాధికారులు దీనిపై దృష్టి సారించాలని పలువురు కోరుతున్నారు. తాజాగా ఓ ఉన్నతాధికారి పరీక్ష కేంద్రాల విధులు తానే దగ్గరుండి పరిశీలించేందుకు సిద్ధమైనట్లు సమాచారం. ఈ నెలలో జరిగే పరీక్షల్లోనైనా పారదర్శకత వస్తే బాగుంటుందని పలువురు ఆశిస్తున్నారు. మరోవైపు డిగ్రీ దూరవిద్యకు సంబంధించి మూడో, ఐదో సెమిస్టర్‌కు సంబంధించి హాల్‌టిక్కెట్‌లు విడుదల చేశారు. వర్సిటీ దూరవిద్య వెబ్‌సైట్‌ నుంచి వాటిని డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement