అన్ని పథకాల్లో బాబు కోతలే
అబ్బాయ్: బాబాయ్ ఎలా ఉన్నావు. పిన్ని, పిల్లలు అంతా బాగున్నారా.
బాబాయ్: మా సంగతి సరే.. నువ్వు ఎప్పుడు వచ్చావ్ సిటీ నుండి.
అబ్బాయ్: నిన్న రాత్రి వచ్చాను బాబాయ్. ఊరికొచ్చి రెండేళ్లపైనే అయ్యింది కదా.. అలా చూసొద్దామని వెళుతున్న. ఏంటీ ఊర్లో విశేషాలు. ఊరంతా రచ్చబండ దగ్గర ఉన్నట్లుందిగా బాబాయ్. ప్రకాశం తాత, సుబ్బన్న బాబాయ్, సందెపూడి పెద్దయ్యన్న, శీను గాడు, నరసాలుగాడు.. అంతా ఈడే ఉన్నారే. ఎలా ఉన్నారంతా.
అందరూ..: బానే ఉన్నాంలే అబ్బాయ్.
అబ్బాయ్: అయినా నీకేంటి ప్రకాశం తాత. ఇంట్లో నుంచి కాలు బయటకు పెట్టకుండా ఒకటో తారీకే ఇంటొకొచ్చే పింఛను.. షుగర్, బీపీలకు నెలకు సరిపడా మాత్రలిచ్చే ఊరికొచ్చే 104 బండి, ఇంటి ముందుకొచ్చే రేషన్‌బండి, నీ పని బానే ఉంటాదిగా.
ప్రకాశం: ఓరబ్బాయ్.. అయన్నీ పోయి రెండేళ్లయ్యిందిరా అయ్యా. పింఛను ఇంటికి వత్తారా.. మనమే వాళ్ల కాడికెళ్లాలా అన్నది ఆళ్ల దయ. మాత్రలంటావా.. నెలకు కాదు వారానికి పది రోజులకు చేతిలో పెట్టి పోతన్నారు లేవని. మిగిలిన ఇరవై రోజులకు నేనే కొనుక్కోవాలిరా అయ్యా. పింఛను వచ్చే నాలుగేలలో సగందాకా ఈ మందుబిళ్లలకే పోతాయి. ఇక రేషన్ బండ్లూ ఎత్తేసినారు. చౌకధరల దుకాణానికి పోయి సరుకులు తెచ్చుకోవాలా. కాళ్లు పట్టేయకుంటే సచ్చీ, చెడీ తెచ్చుకుంటున్నా. అయినా దూరంగా ఉండి చూత్తే కొండలు కూడా నున్నగా అగుపిత్తాయి. మా బతుకులు కూడా అంతేరా అబ్బాయ్.
అబ్బాయ్: సుబ్బన్న బాబాయ్.. ఎలా ఉంది పొలం? ఈ ఏడు ఏమేం పంటలేశావేంటి?
సుబ్బన్న: ఎందకడుగుతావులే రా అబ్బాయ్ ఎవసాయం గురించి. చావలేక, బతకలేక ఎవసాయం చేయడమే. నాకున్న ఐదెకరాలకు తోడు ఏదో పాముకుందామని ఓ పదిహేను ఎకరాలు భూమి కౌలుకు తీసుకుని ఎలగబెట్టాలే. సగం పత్తి, సగం మిరప ఏశాను. నల్లతామరతో మిరప ఊడ్సిపెట్టుకుపోయింది. గులాబీరంగు పురుగు పత్తిని ముంచేసింది. ఏదో పత్తి ఎకరాకు నాలుగైదు కింటాలొచ్చినా.. ఉపయోగం లేకుండా ఉంది. సీసీకి తీసకెళితే బాలేదని కొనలేదు. బయట బోకర్లకమ్మి వచ్చాను. తుపాను వచ్చింది. మిర్చి మునిగింది. కానీ రూపాయి కూడా ఇయ్యడం అవ్వదన్నారు. ఏం చేత్తం ఈ ఏడాది పదిలచ్చల దాకా ఎవసాయంలో నట్టాలొచ్చినట్టే. గత పెభుత్వంలో అయినా రైతు భరోసా అని, పంటల బీమా, రైతు భరోసా కేంద్రాల్లో ఎరువలని, మందులనీ వచ్చేటివి. ఇప్పుడు ఏదీ లేదు.
అబ్బాయ్: సందెపూడి పెద్దయ్యన్న గారూ.. మీ మనవడిని ఎంబీబీఎస్ చదివించాలన్నారుగా .
పెద్దయ్యన్న: ఏంది బాబూ చేర్పిచ్చేది. అప్పుడు అంటే అవన్నీ ప్రభుత్వానివి కదా.. ఎట్టాగూ మనవడికి మంచి మార్కులొస్తాయి. అందులో సీటు వచ్చిద్దని అనుకున్నా. ఇంతలో సర్కారు మారిందిగా. ప్రబుత్వ కళాశాలలను ప్రైవేటీకరణ చేస్తున్నారంట. ఇప్పుడు వాటిల్లో సీట్లు కొనాలంటే ఎకరాలమ్ముకోవాలి. నీకు తెలిసిందేగా మా పెద్దోడు వ్యాపారమంటే అప్పుట్లో మూడెకరాలమ్మాను. ఇంకా ఉన్న రెండు కూడా అమ్మి డాక్టరు చదివిస్తే రేపు పిల్లల పరిస్థితి ఏమిటని ఊరుకున్నాను బాబు. వాడిని కూడా ఏదో ఒకటి చేయాలి.
అబ్బాయ్: ఏం శీనుగా.. ఏం చేస్తున్నావురా నువ్వు. నిన్న సాయంత్రం మీ ఇంటికొచ్చాను. ఏక్కడికెళ్లినావ్?
శీను: చెల్లి చెప్పిందిరా వచ్చి ఎళ్లినావని. నిన్న ఉదయం మిర్చికి నీళ్లెట్టినాలే. ఇయ్యాల యూరియా సల్లాల. మొక్కలకు యూరియా కొందామని మండలానికి పోయి వచ్చినాను.
అబ్బాయ్: అదేంటిరా మండలం దాకా ఎందుకు. మన ఊరిలో రైతు భరోసా కేంద్రం ఉంది కదా.
శీను: ఆ ఆ ఉందిలే. అదిప్పుడు రైతు సేవ. కానీ ఆడ యూరియా దొరకదు. బుకింగ్ సేసేటి మిసన్లు దుమ్ముకొట్టుకోయి పడిన్నయి. అసలు ఎప్పుడు తీత్తారో, ఎప్పుడు ఉంటారో కూడా తెల్దు. బయటకెళ్లి బ్లాక్‌లో కొనాల్సిందే.
అబ్బాయ్: పిన్నమ్మ బాగున్నావా.. ?
పిన్ని: ఏముందిరా.. ఆరోగ్యమే ఏమీ బాగుండట్లేదు. నెలనెలా పట్నం పోయి ఆస్పత్రిలో చూయించుకుంటున్నా. ఉన్న నాలుగు రూపాయలూ ఈ రోగాలకే పోతాన్నాయిరా..
అబ్బాయ్: అదేంటి.. మన ఊర్లో అంత పెద్ద విలేజ్ క్లినిక్ కట్టారుగా!
పిన్ని: ఆ.. కట్టారుగానీరా. అప్పట్లో ఆడికి పెద్ద పెద్ద డాటర్లు వచ్చేవాల్లు, మనం ఆడదాకా పోలేకపోతే వాళ్లే ఇంటికొచ్చి పరీచ్చలు చేసి మందులిచ్చి పోయేటోళ్లు. పెబుత్వం మారింది. ఇప్పుడేమో అక్కడున్న వాళ్లే ఎప్పుడుంటారో తెలియట్లా. ఇక డాటర్లు రాడమే మానేశారు. అందుకని పట్నం పోయి చూయించుకుంటున్నా.
అబ్బాయ్: అవును పిన్నమ్మ... ఈ పక్కనిల్లు అప్పుడు రెండేళ్ల కింద నేనొచ్చినప్పుడే పడేత్తన్నారు కదా.. ఇంకా కట్టుకోలేదేంటీ..
పిన్ని: అదా.. అలా వదిలేసిండులే. పాత పెభుత్వం లచ్చాముప్పాతిక దాకా ఇచ్చేదంట. ఈ పెభుత్వం నాలుగు లచ్చలిత్తదని ఎలచ్చన్లప్పుడు చెప్పిండ్రంటా. ఇత్తే కట్టేసుకుంటారు.
అబ్బాయ్: ఏమో పిన్నమ్మా.. ఇప్పుడు నువ్వు చెప్పే మాటలకు, ఇందాక అక్కడ రచ్చబండ దగ్గర బాబాయ్ వాళ్లు చెప్పే మాటలు చూస్తుంటే.. బాధగా ఉంది. రైతులు, మహిళలు, వృద్ధులు, చదువుకునే పిల్లలు.. ఇలా ఎవ్వరి పరిస్థితీ బాలేనట్లుగా ఉంది. ఏం చేస్తాం. ప్రభుత్వాలు సరిగా ఉంటేనే మనలాంటి ప్రజల పరిస్థితి బాగుంటుంది.
– సాక్షి, గుంటూరు


