చెట్టును ఢీకొన్న కారు.. ఒకరి మృతి: ఇద్దరికి గాయాలు
ప్రత్తిపాడు: కారు అదుపుతప్పి చెట్టును ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందగా ఇద్దరు గాయాలపాలైన ఘటన మండలంలో చోటుచేసుకుంది. గుంటూరుకు చెందిన అంచా వెంకట సువర్ణ అనే వృద్ధురాలు తన ఇద్దరు కుమారులతో కలిసి బుధవారం ప్రత్తిపాడు మండలం గనికపూడిలో దేవర కార్యక్రమానికి వచ్చారు. కార్యక్రమం పూర్తయిన తరువాత మహేంద్ర ఎక్స్‌యూవీ వాహనంలో గుంటూరుకు తిరుగు పయనమయ్యారు. మార్గ మధ్యలో ప్రత్తిపాడు మండలం కోయవారిపాలెం సమీపంలో వేగంగా వెళుతున్న కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న వెంకట సువర్ణతో పాటు కారు నడుపుతున్న అంచా శ్రీనివాసరావులకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న ప్రత్తిపాడు పోలీసులు క్షతగాత్రులను అంబులెన్స్‌లో గుంటూరుకు తరలించారు. కాగా అందులో ప్రయాణిస్తున్న అంచా భాను ప్రసాద్ (60) తీవ్ర గాయాలపాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు తెలిసింది. ప్రమాదంలో కారు ముందు భాగం నుజ్జునుజ్జయ్యింది. ప్రమాదానికి నిద్రమత్తు కారణమని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. క్షతగాత్రులది స్వగ్రామం గనికపూడి కాగా కొన్నేళ్లుగా గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్డులో నివాసం ఉంటున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ప్రత్తిపాడు ఎస్‌ఐ ఎన్.నరహరి తెలిపారు.


