
మాదకద్రవ్యాల నిర్మూలనకు కృషి అవసరం
జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి
గుంటూరు వెస్ట్: యువతతోపాటు దేశాన్ని నిర్వీర్యం చేసే మాదకద్రవ్యాల వినియోగాన్ని నివారించేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి తెలిపారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్‌లోని డీఆర్సీ సమావేశ మందిరంలో జిల్లా ఎస్పీ సతీష్‌కుమార్‌తో కలిసి నిర్వహించిన జిల్లా స్థాయి మాదకద్రవ్యాల సమన్వయ కమిటీ సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. బాధితులకు వెంటనే డీ అడిక్షన్ సెంటర్‌ల ద్వారా కౌన్సెలింగ్, చికిత్స అందించాలని సూచించారు. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి, జిల్లా జైలులోనూ డీ అడిక్షన్ సెంటర్ల ఏర్పాటుకు కృషి చేయాలన్నారు. విద్యా సంస్థల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని పేర్కొన్నారు. స్వచ్ఛంద సంస్థల సహాయం తీసుకోవాలన్నారు. విక్రేతలపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని తెలిపారు. శివారు ప్రాంతాల్లోని శిథిల భవనాలు కూల్చివేయాలని ఆదేశించారు. ఎవరైనా విక్రేతల సమాచారం తెలిస్తే 1972 టోల్ ఫ్రీ నంబరుకు కాల్ చేయాలని కోరారు. దీనికి సంబంధించిన ప్రచార బోర్డులను విద్యా సంస్థలతోపాటు అన్ని ప్రధాన కూడళ్లలో కూడా ప్రదర్శించాలన్నారు. ఎస్పీ సతీష్‌కుమార్ మాట్లాడుతూ మాదకద్రవ్యాలతో అనర్థాలపై పూర్తి అవగాహన కల్పించేలా వారధి, పల్లె నిద్ర, ఆపరేషన్ నషా ముక్త్ భారత్, సేఫ్ క్యాంపస్ వంటి అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. జిల్లాలో గత నెలరోజులుగా ఎనిమిది ఎన్‌డీపీఎస్ కేసులు నమోదు అయ్యాయని, 53 మందిని అరెస్టు చేశామని తెలిపారు. ఈ నిందితులకు రౌడీషీటర్ల తరహా కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నామని తెలిపారు. సమావేశంలో డీఆర్వో షేక్ ఖాజావలి, డీఎంహెచ్‌వో డాక్టర్ కొర్రా విజయలక్ష్మి, ఇంటర్మీడియట్ ఆర్‌ఐఓ సునీత, ఐసీడీఎస్ పీడీ ప్రసూన, సోషల్ వెల్ఫేర్ డీడీ చెన్నయ్య, అధికారులు పాల్గొన్నారు.