
‘సహకార’ సమరానికి సిద్ధం
ఐదు వేల మందికిపైగా ఓటర్లు
తెనాలిలో కో ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ఎన్నికలకు ఏర్పాట్లు పోటీ అనివార్యమయ్యేలా పరిస్థితులు
బరిలో సీనియర్ టీడీపీ నేత
టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ కౌన్సిలర్ గుమ్మడి రమేష్ చైర్మన్ పదవికి పోటీపడనున్నారు. ఈ విషయాన్ని ఆయన శనివారం సాయంత్రం విలేకరుల సమావేశంలో ప్రకటించారు. గత పదిహేనేళ్లుగా ఒకే వ్యక్తి అధికారంలో కొనసాగుతున్నారని చెప్పారు. రమేష్ రంగప్రవేశంతో అర్బన్ బ్యాంక్ ఎన్నిక రసవత్తరం కానుంది.
తెనాలి కో–ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ పాలకవర్గ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. షెడ్యూలును ప్రకటించారు. బ్యాంక్ పాలకవర్గ ఎన్నికల్లో ఈ సారి టీడీపీ తరఫున ఇంకా అభ్యర్థులను నిర్ణయించలేదు. ప్రస్తుత చైర్మన్ మళ్లీ ఎన్నికయేలా ఏకగ్రీవం చేసేందుకు యత్నిస్తున్నారు. ఈసారి పోటీ అనివార్యమయ్యే పరిస్థితి కనిపిస్తోంది. కూటమి పార్టీల్లో ఒకటైన జనసేన, ప్రతిపక్ష పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎలాంటి వ్యూహం అనుసరిస్తాయనేది ఆసక్తికరంగా మారింది.
తెనాలి: రాష్ట్రంలో సహకార చట్టం వచ్చాక తొలిగా తెనాలిలో ఏర్పాటైన అర్బన్ బ్యాంక్ ఇది. ఏర్పడి శతాబ్దం దాటినా ఇప్పటికీ ఎదుగూ బొదుగూ లేకుండా ఒకే శాఖతో ఉంది. బ్యాంక్ ఎన్నికలు వచ్చే నెల 14న నిర్వహించాలని నిర్ణయించారు. 12 మంది పాలకవర్గ సభ్యుల ఎన్నికను రహస్య బ్యాలెట్లో నిర్వహించనున్నారు. సెప్టెంబరు 7వ తేదీన ఉదయం బ్యాంక్ కార్యాలయంలో నామినేషన్లు స్వీకరిస్తారు. 8న పరిశీలన, 9న ఉపసంహరణకు అవకాశం కల్పించారు. అదేరోజు అభ్యర్థుల తుది జాబితా ప్రకటిస్తారు. సాయంత్రం ఎన్నికల చిహ్నాల కేటాయింపు ఉంటుంది. 14న ఉదయం 7 – మధ్యాహ్నం 2 గంటల వరకు ఎన్నిక నిర్వహిస్తారు. ఓట్ల లెక్కింపు మధ్యాహ్నం 3 గంటలకు ఉంటుంది. ఎన్నికల అధికారిగా కో ఆపరేటివ్ సొసైటీ విశ్రాంత అసిస్టెంట్ రిజిస్ట్రార్ వ్యవహరిస్తారు. ప్రస్తుతం బ్యాంక్ పాలకవర్గం త్రీమెన్ కమిటీ చైర్మన్‌గా కొనసాగుతున్న మంగమూరి హరిప్రసాద్ మూడోసారి చైర్మన్‌గా ఎన్నికయ్యేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్టు సమాచారం.
ఎమ్మెల్సీ మద్దతు?
ప్రస్తుత చైర్మన్ నివాసానికి దగ్గర్లోని మారీసుపేటలో గల ఎన్‌సీఆర్‌ఎం హైస్కూలులో ఎన్నికలు జరగనున్నాయి. షెడ్యూలును కనీసం సభ్యులకు కూడా తెలియపరచలేదు. ఒకే పత్రికకు సమాచారం ఇచ్చారు. టీడీపీ ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ కూడా పార్టీ తరఫున బ్యాంక్ చైర్మన్ అభ్యర్థిని ప్రకటించలేదని అంటున్నారు. ఆయన మద్దతు హరిప్రసాద్‌కేనన్న వాదన వినిపిస్తోంది. దీంతో అభ్యర్థిని రంగంలోకి దింపే ఆలోచనలో ఆలపాటి రాజా వ్యతిరేక వర్గం ఉందని విశ్వసనీయ సమాచారం. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ప్రత్యేకాధికారి పాలనలో ఉన్న అర్బన్ బ్యాంక్‌కు ప్రభుత్వం ద్వారా త్రీమెన్ కమిటీని నియమించారు. అప్పుడు టీడీపీ నాయకులు ఆ కమిటీ నియామకంపై కోర్టును ఆశ్రయించారు. ఎన్నికలను నిర్వహించాలని కోర్టు ఆదేశించింది. దీంతో ఆ కమిటీ రద్దయింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మళ్లీ త్రీమెన్ కమిటీని నియమించుకున్నారు. దీనిపై మళ్లీ కోర్టును ఆశ్రయించటంతో ఎన్నిక అనివార్యమైందని చెబుతున్నారు. కూటమి పార్టీల్లో ఒకటైన జనసేన పీఏసీ చైర్మన్, స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ ఏ నిర్ణయం తీసుకుంటారు? ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ఎలాంటి వైఖరిని ప్రదర్శిస్తారనే చర్చ పట్టణంలో నడుస్తోంది.
బ్యాంకుకు 5 వేల మంది ఓటర్లు వరకు ఉన్నారు. గతంలో పాలకవర్గాలు ఇష్టారాజ్యంగా ఓటర్లను చేర్పించాయి. బ్యాంకు పరిధిలో కాకుండా కొల్లిపర, వేమూరు నియోజకవర్గానికి చెందిన వ్యక్తుల ఓట్లు ఉన్నాయి. మరికొందరు ఓటర్లకు సంబంధించి పేర్లు ఉన్నప్పటికీ చిరునామాలు లేవు. ఇలాంటి అవకతవకల జాబితా సవరించిందీ లేనిదీ తెలియదు. ఇదే జాబితాలో ఎన్నిక నిర్వహించటంపైనా విమర్శలు వస్తున్నాయి.