
పెట్రోలు సీసాతో నిరసన వ్యక్తం చేస్తున్న వడ్డెర కాలనీ మహిళలు
పోలీసులు పక్షపాత వైఖరితో దారుణంగా హింసిస్తున్నారు
సుద్దపల్లిలో ఇరువర్గాల వివాదం నేపథ్యంలో ఉద్రిక్తత
సుద్దపల్లి(చేబ్రోలు): వినాయక విగ్రహ నిమజ్జనం సందర్భంగా మూడు రోజుల కిందట రెండు సామాజిక వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో స్థానిక టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్, పోలీసులు ఒక వర్గానికి అనుకూలంగా పనిచేస్తూ పక్షపాత వైఖరిని అవలంబిస్తున్నారని గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం సుద్దపల్లి గ్రామస్తులు పేర్కొన్నారు. ఈ మేరకు ఆదివారం వడ్డెర కాలనీకి చెందిన మహిళలు నిరసన కార్యక్రమం చేపట్టారు. గ్రామంలో వడ్డెర కింగ్స్ ఆధ్వర్యంలో శుక్రవారం వినాయక విగ్రహ నిమజ్జనంలో భాగంగా ఊరేగింపు నిర్వహించారు.
రెండు వర్గాల మధ్య వివాదం జరగడంతో పది మందికి గాయాలయ్యాయి. దీంతో ఇరువర్గాలకు చెందిన 16 మందిపై కేసులు నమోదు చేశారు. ఇందులో ఓ వర్గం అధికార టీడీపీకి చెందిన వారు. అయితే, పోలీసులు తమ పిల్లలను మాత్రమే స్టేషన్‌కు తీసుకువెళ్లి హింసిస్తున్నారని వడ్డెర కాలనీకి చెందిన మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రత్యర్థి వర్గీయులు రాత్రి సమయంలో తమ ఇళ్లపైకి వచ్చి దాడులు చేస్తున్నప్పటికీ పోలీసులు స్పందించటం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఆలకుంట శ్రీను, వీరమ్మ దంపతులకు చెందిన ఇంటిపై దాడి చేశారని, రేకులు పగలకొట్టారని వాపోయారు. పల్లపు రాజాకు చేయి విరిగిందని, కొవ్వూరు శివశంకర్‌కు తల పగిలిందని, మరో ఐదుగురికి గాయాలైనట్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే ధూళిపాళ్ల స్పందించి న్యాయం చేయకపోతే పెట్రోలు పోసుకొని ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు.
