
సందడిగా లడ్డూ వేలం పాటలు
తాడేపల్లి రూరల్: వేలంలో వినాయక లడ్డూ ప్రసాదానికి భారీ ధర పలికింది. తాడేపల్లి రూరల్ ప్రాతూరు, కుంచనపల్లి క్రాస్ రోడ్‌లో అపర్ణ అమరావతి వన్ అపార్ట్‌మెంట్ సముదాయంలో గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం వద్ద ఆదివారం లడ్డూ వేలం పాట నిర్వహించారు. ఐదు రోజుల పాటు విశేష పూలందుకున్న వినాయకుడుకి ప్రత్యేక పూజలతో పాటు పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. వినాయకుడి లడ్డూ ప్రసాదాన్ని వేలం పాటలో కొండూరి కిరణ్‌రెడ్డి, శ్రీలత దంపతులు రూ. 6,81,003కు దక్కించుకున్నారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ వేలం పాటలో లడ్డూ ఇంత ధర పలకడం సంతోషదాయకమని తెలిపారు. కార్యక్రమంలో అపార్ట్‌మెంట్ ప్రెసిడెంట్ మధుసూదన్‌రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ రాజేష్, సెక్రటరీ రాకేష్, జాయింట్ సెక్రటరీ రత్నసాగర్, ట్రెజరర్ బ్రహ్మారావు, సభ్యులు రఘురాం, షబ్బీర్, కల్యాణ్, అన్నపూర్ణ పాల్గొన్నారు.
రూ.3,67,000 పలికిన స్వామి లడ్డూ
పట్టణ పరిధిలోని వైఎస్సార్ సెంటర్‌లో వీసా విఘ్నేశ్వర ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం 31 కేజీల లడ్డూకు వేలం పాట నిర్వహించారు. వైఎస్సార్ సెంటర్‌కు చెందిన మేకా శ్రావణ్‌రెడ్డి కుమార్తె పావని రూ. 3,67,000కు పాటను దక్కించుకున్నారు. 11 కేజీల లడ్డూను కారుమూరి సురేంద్ర రూ. 75,000కు దక్కించుకోగా, కేసరి శ్రీనివాసరెడ్డి మణి హారాన్ని రూ. 1,01,116కు సొంతం చేసుకున్నారు. విగ్రహం వద్ద జరిగిన ప్రత్యేక పూజల్లో వైఎస్సార్ సీపీ మంగళగిరి నియోజకవర్గ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి (డీవీఆర్) ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం భక్తులకు భారీ అన్నదానాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో వీసా విఘ్నేశ్వర ఉత్సవ కమిటీ సభ్యులు భీమిరెడ్డి శరణ్‌కుమార్ రెడ్డి, గుంటక నితిన్ రెడ్డి, మేకా అంజిరెడ్డి, బద్దిగం సుబ్బారెడ్డి, రాజగోపాల్ రెడ్డి పాల్గొన్నారు.

సందడిగా లడ్డూ వేలం పాటలు