
విద్యతోపాటు క్రీడల్లోనూ రాణించాలి
లయోలా ఇంజినీరింగ్ కళాశాల డైరెక్టర్ వంశీకృష్ణారెడ్డి ముగిసిన అంతర్రాష్ట్ర మహిళల సాఫ్ట్‌బాల్ పోటీలు
సత్తెనపల్లి: విద్యతోపాటు క్రీడల్లోనూ రాణించాలని లయోలా ఇంజినీరింగ్ కళాశాల డైరెక్టర్ వంశీకృష్ణారెడ్డి అన్నారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం ధూళ్లిపాళ్ల సమీపంలోని లయోలా ఇంజినీరింగ్ కళాశాలలో జరుగుతున్న 12వ అంతర్ రాష్ట్ర స్థాయి సీనియర్ మహిళల సాఫ్ట్‌బాల్ చాంపియన్‌షిప్ పోటీలు ఆదివారం ముగిశాయి. ఈ సందర్భంగా నిర్వహించిన బహుమతి ప్రదానోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు. విద్యార్థి దశ నుంచే క్రీడల్లోనూ రాణించాలన్నారు. క్రమం తప్పని సాధన ముందుకు తీసుకు వెళుతుందన్నారు. రిటైర్డ్ పీడీ దాసరి కోటేశ్వరరావు, సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ ఏపీ రాష్ట్ర కన్వీనర్ ఎంవీ రమణ, ఆర్గనైజింగ్ సెక్రటరీ పి.నరసింహారెడ్డి, గుంటూరు జిల్లా సెక్రటరీ పి. సామంతరెడ్డి, ఎగ్జిక్యూటివ్ మెంబర్ తిరుపతి, ట్రెజరర్ జనార్దన్ యాదవ్, లయోలా ఇంజినీరింగ్ కళాశాల కరస్పాండెంట్ శ్రీనివాస్ ప్రసంగించారు. అనంతరం విజేతలను అభినందించి, బహుమతులు అందించారు.
హోరాహోరీగా పోటీలు...
పోటీలు నువ్వా నేనా అన్నట్లు హోరాహోరీగా సాగాయి. సెమీఫైనల్స్‌లో వైఎస్సాఆర్ కడప, గుంటూరు జట్లు తలపడ్డాయి. 0–5తో గుంటూరు విజయం సాధించింది. విజయనగరం, కృష్ణా జట్లు పోటీ పడగా, 11–2తో విజయనగరం విజేతగా నిలిచింది. ప్రీ ఫైనల్స్‌లో గుంటూరు, విజయ నగరం తలపడ్డాయి. గుంటూరు 3–2తో గెలిచింది. వైఎస్సాఆర్ కడప, కృష్ణా జట్లు తలపడిన పోటీలో 4–2తో వైఎస్సాఆర్ కడప జట్టు విజేతగా నిలిచింది. ఫైనల్స్‌లో విజయనగరం, వైఎస్సాఆర్ కడప జట్లు తలపడ్డాయి. 8–2తో విజయనగరం విజయం సాధించింది. గ్రాండ్ ఫైనల్‌లో గుంటూరుపై విజయనగరం 5–4తో గెలిచింది. చాంపియన్‌గా విజయనగరం, రన్నర్స్‌గా గుంటూరు, తృతీయ స్థానం వైఎస్సాఆర్ కడప, నాలుగవ స్థానం కృష్ణా జిల్లా జట్టు కై వసం చేసుకున్నాయి.

విద్యతోపాటు క్రీడల్లోనూ రాణించాలి

విద్యతోపాటు క్రీడల్లోనూ రాణించాలి