
స్మార్ట్ కార్డుతో సులభతర సేవలు
కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్
తెనాలి టౌన్: కొత్త స్మార్ట్ కార్డుతో రేషన్ కార్డుదారులకు పారదర్శకతతో కూడిన సులభతరమైన సేవలు అందుబాటులోకి వస్తాయని కేంద్ర గ్రామీణాభివృద్ధి, సమాచార శాఖల సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. రూరల్ మండలం నందివెలుగులో ఆదివారం క్యూఆర్ స్కాన్‌తో కూడిన కొత్త స్మార్ట్ కార్డులను లబ్ధిదారులకు ఆయనతో పాటు రాష్ట్ర ఆహార పౌర సరఫరాల శాఖమంత్రి నాదెండ్ల మనోహర్, ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ పంపిణీ చేశారు. అనంతరం ఏర్పాటుచేసిన సభలో మంత్రి చంద్రశేఖర్ మాట్లాడారు. దేశంలో ఎక్కడాలేని విధంగా కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో మొదటిసారిగా స్మార్ట్ కార్డులను అందుబాటులోకి తెచ్చి, రేషన్ లబ్ధిదారులకు సులభతరమైన సేవలను తీసుకువచ్చిందని వెల్లడించారు. సచివాలయ సిబ్బంది, డీలర్లు కార్డుదారుల ఇంటికి వచ్చి అందిస్తారని వివరించారు. మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ రాష్ట్రంలో 1,44,00000 మందికి స్మార్ట్‌కార్డులు ఇస్తున్నట్లు తెలియజేశారు. జిల్లాలో 5,00000 మందికి, నియోజకవర్గంలో 83,866 మందికి ఇవ్వనున్నట్లు వివరించారు. సబ్సిడీపై రేషన్ దుకాణాల్లోనే మరిన్ని నిత్యావసర సరుకులు అందిస్తామని తెలిపారు. గిరిజన ప్రాంతాల్లో ఆర్గానిక్ ఉత్పత్తులు అందించేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో 29,762 రేషన్ షాపుల ద్వారా 24గంటలు సేవలు అందించే ప్రక్రియకు శ్రీకారం చుడతామని తెలిపారు. స్మార్ట్ కార్డు స్కాన్ చేస్తే లబ్ధిదారుడి వివరాలు పూర్తిగా వెల్లడవుతాయని, ఎక్కడి నుండైనా రేషన్ పొందవచ్చని తెలిపారు. ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ రాజకీయాలకు అతీతంగా పేదరికాన్ని పారదోలడానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పని చేస్తున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో సబ్ కలెక్టర్ సంజనా సింహా, ఇన్‌చార్జి జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి కంభంపాటి శ్రీనివాస్, తహసీల్దార్ కె.వి.గోపాలకృష్ణ, ఎంపీడీవో అత్తోట దీప్తి, డెప్యూటీ ఎంపీడీవో వై.వి.డి.ప్రసాద్, సర్పంచ్ ధూళిపాళ్ల పవన్‌కుమార్, ఎంపీటీసీ సభ్యురాలు విజయలక్ష్మి, నన్నపనేని లింగారావు, పలువురు గ్రామపెద్దలు పాల్గొన్నారు.