ఆ ఇద్దరిపై చర్యలేవీ!? | - | Sakshi
Sakshi News home page

ఆ ఇద్దరిపై చర్యలేవీ!?

Oct 26 2024 2:35 AM | Updated on Oct 26 2024 1:46 PM

-

సహానా హత్య కేసులో నిందితుడి స్నేహితుల పాత్రపై అనుమానం

 ఆస్పత్రిలో నవీన్‌తోపాటు ఇద్దరిని చూశానన్న సహానా తల్లి

 ఫిర్యాదులో ఉన్నా అరెస్టు సందర్భంలో లేని స్నేహితుల ప్రస్తావన

 రాజకీయ ఒత్తిళ్లే కారణమా?

తెనాలి రూరల్‌: రౌడీషీటర్‌ రాగి నవీన్‌ చేసిన అమానుష దాడిలో బ్రెయిన్‌ డెడ్‌ అయి మరణించిన సహానా కేసు విచారణలో మృతురాలి కుటుంబ సభ్యులు, బంధువులు పలు అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు. పోలీసులు అరెస్టు చేసిన నిందితుడితోపాటు అతని స్నేహితులపై చర్యలు తీసుకోకపోవడం వీరి అనుమానాలకు ప్రధాన కారణం. ఈనెల 19న సాయంత్రం 6.20 గంటల ప్రాంతంలో సహానాను నవీన్‌ తన కారులో తీసుకెళ్లి తెనాలి మండలం కఠెవరం నుంచి ఎరుకలపూడి వెళ్లే మార్గంలో ఆమైపె దాడిచేశాడు.

సహానా వాంతులు చేసుకుని అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో ఆమెను తెనాలి ఆర్టీసీ బస్టాండ్‌ వెనుకనున్న ఓ ప్రైవేటు వైద్యశాలకు తీసుకెళ్లాడు. అక్కడ వైద్యులు అందుబాటులో లేరని చెప్పడంతో సహానా తల్లి అరుణకుమారికి ఫోన్‌చేసి విషయం చెప్పి ప్రకాశం రోడ్డులోని మరో వైద్యశాలకు తన ఇద్దరు స్నేహితులతో కలిసి తీసుకెళ్లాడు. అక్కడకు సహానా తల్లి వెళ్లగానే ముగ్గురూ జారుకున్నారు. ఇక పోలీసులకు అరుణకుమారి ఇచ్చిన ఫిర్యాదులో నవీన్‌, అతని స్నేహితుల ప్రస్తావన ఉంది కానీ, 22వ తేదీ సాయంత్రం మీడియాకు నవీన్‌ అరెస్టు విషయాన్ని పోలీసులు వెల్లడించిన సందర్భంలో నిందితుడి స్నేహితుల ప్రస్తావనలేదు.

దర్యాప్తు ‘సాగు..తోందంట’!
సహానా హత్య కేసులో రాజకీయ ఒత్తిళ్ల కారణంగానే పోలీసులు పూర్తిస్థాయిలో విచారణ జరపడంలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కొల్లిపర మండలం వల్లభాపురం గ్రామానికి చెందిన మార్కెట్‌ యార్డు మాజీ చైర్మన్‌, టీడీపీ నాయకుడు వంగా సాంబిరెడ్డికి నవీన్‌ ప్రధాన అనుచరుడిగా ఉన్నాడు. చంద్రబాబు సమక్షంలోనే టీడీపీలో చేరాడు. కేంద్రమంత్రి డాక్టర్‌ పెమ్మసాని చంద్రశేఖర్‌ అనుచరుడిగా మొన్నటి ఎన్నికల్లో చురుగ్గా పనిచేశాడు. రాజకీయ ఒత్తిళ్ల కారణంగానే కేసు దర్యాప్తు సరిగ్గా జరగడంలేదని సహానా కుటుంబసభ్యులు అనుమానిస్తున్నారు. నవీన్‌తో పాటు ఉన్న ఇద్దరు స్నేహితులను దత్తు, సుమంత్‌లుగా పోలీసులు గుర్తించినా వారిపై చర్యల్లేవు. కేసు పురోగతిపై టూటౌన్‌ సీఐ నిసార్‌ బాషాను వివరణ కోరగా.. ఇంకా పూర్తిస్థాయిలో విచారించాల్సి ఉందని పేర్కొన్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement