మాదకద్రవ్యాల నివారణపై న్యాయ విజ్ఞాన సదస్సు
గుంటూరు లీగల్: జాతీయ, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ అమరావతి ఆదేశాల మేరకు జాతీయ యువజన దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా ఎకై ్సజ్ పోలీసులకు శుక్రవారం గుంటూరులో న్యాయ విజ్ఞాన సదస్సును జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సయ్యద్ జియాఉద్దీన్ నిర్వహించారు. ఈ సందర్భంగా సయ్యద్ జియాఉద్దీన్ మాట్లాడుతూ యువత మత్తు పదార్థాలకు బానిసలు కాకుండా వికసిత భారత్ వైపు అడుగులు వేయించే దిశగా అవగాహనా కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. ప్రస్తుత సమాజంలో 10 నుంచి 17 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న విద్యార్థులు స్కూల్, కాలేజీల్లో మత్తు పదార్థాలకు బానిసలుగా మారుతున్నారన్నారు. ప్రజలకు, విద్యార్థులకు మరింతగా అవగాహన కలిగించడానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలన్నారు. ఎకై ్సజ్ సూపరింటెండెంట్ అరుణకుమారి మాట్లాడుతూ మన సమాజంలో మాదక ద్రవ్యాలు చాప కింద నీరులా ప్రమాదకరంగా మారుతున్నాయని, మాదక ద్రవ్యాల నివారణకు ఇలాంటి అవగాహనా సదస్సులు మరింతగా ఉపయోగపడతాయని తెలిపారు. ప్యానెల్ అడ్వకేట్ కట్ట కాళిదాసు, ఎల్‌ఏడీసీ చీఫ్ సురేష్ బాబు, డెప్యూటీ ఎస్‌బీఏ ఝాన్సీలు యువతలో మాదక ద్రవ్యాల నివారణకు అవగాహన కలిగించారు. అనంతరం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ నుంచి ప్రారంభించిన ర్యాలీ మెడికల్ కాలేజీ రోడ్ మీదుగా పోలీస్ పరేడ్ గ్రౌండ్ నుంచి జిల్లా కోర్టు వరకు కొనసాగింది.


