Anakapalle: జ్యూయలరీ వ్యాపారి కుటుంబం ఆత్మహత్య | Sakshi
Sakshi News home page

Anakapalle: జ్యూయలరీ వ్యాపారి కుటుంబం ఆత్మహత్య

Published Sat, Dec 30 2023 1:44 AM

- - Sakshi

పనులు పూర్తి చేసుకొని నాన్న ఇంటికొస్తే పిల్లలకు ఆనందం. భర్త కోసం ఎదురుచూసే గృహిణి మనసుకు నిశ్చింత. ఆయన వస్తూ వస్తూ తినడానికేమైనా తెస్తే పిల్లలు ఎగబడి తింటారు. ఈరోజూ అలాగే చేశారు. ఆయన బిర్యానీ తెస్తే అందరూ చక్కగా తిన్నారు. ముద్ద నోట్లో పెట్టే సరికి వారికి తెలీదు.. క్షణాల్లో ప్రాణం తీసే సైనెడ్‌ అందులో ఉందని. తెలుసుకునే లోగానే విగత జీవులయ్యారు.. తొమ్మిదేళ్ల పాపాయిని ఒంటరిగా ఒదిలేసి. తింటుండగా వాంతి కావడంతో ఆ చిన్నారి ప్రాణాలతో బయటపడింది.

సాక్షి, అనకాపల్లి: పట్టణంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. అప్పుల బాధ తాళలేక జ్యూయలరీ వ్యాపారి కుటుంబ సభ్యులతో సహా ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. బిర్యానీలో ౖసైనెడ్‌ కలిపి భార్య, ముగ్గురు పిల్లలతో తినిపించి బలవన్మరణానికి యత్నించాడు. ఈ హృదయవిదారక ఘటన శుక్రవారం వెలుగులోకి వచ్చింది. వీరిలో నలుగురు మృతి చెందగా.. మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. గుంటూరు జిల్లా తెనాలికి చెందిన జ్యూయలరీ వ్యాపారి కొడవలి శివరామకృష్ణ తన కుటుంబంతో ఏడాది క్రితం అనకాపల్లికి వచ్చారు. అనకాపల్లి టౌన్‌లో పెరుగుబజారు సమీపంలో జ్యూయిలరీ షాపును ఏర్పాటు చేసుకుని వ్యాపారం చేసుకుంటున్నారు.

ఆర్థిక ఇబ్బందులతో స్వస్థలాన్ని వీడిన రామకృష్ణ స్థానిక ఉడ్‌ పేటలో ఫైర్‌ స్టేషన్‌ పక్కన లక్ష్మీ ప్యారడైజ్‌ అపార్ట్‌మెంట్‌లో భార్య మాధవి దేవి (40), కుమార్తెలు వైష్ణవి (15), జాహ్నవి (12), కుసుమప్రియ తో కలిసి నివాసముంటున్నారు. తన పిల్లలను స్థానిక సిటీ పబ్లిక్‌ స్కూల్లో చదివిస్తున్నారు. పిల్లలు తొమ్మిది, ఏడు, మూడు తరగతులు చదువుతున్నారు. అనకాపల్లికి వచ్చిన ప్రారంభంలో రామకృష్ణ ఓ బంగారం షాపులో ఉద్యోగం చేసేవాడు. ఆ తరువాత సొంతంగా జ్యూయలరీ షాపు పెట్టుకున్నాడు. ఏడాదిన్నర నుంచి అనకాపల్లి టౌన్‌లోనే ఉన్నా వ్యాపారరీత్యాగానీ, పని నిమిత్తంగానీ ఎవరితోనూ వివాదం పెట్టుకున్న సందర్భాలు లేవు. అయితే ఆ కుటుంబం చుట్టుపక్కల వారితో కలివిడిగా ఉండేవారు కాదని, ముభావంగా అంటీముట్టనట్టు ఒంటరిగా ఉండేవారని స్థానికులు తెలిపారు.

భార్యాపిల్లలకు తెలీకుండా!
రామకృష్ణ గురువారం రాత్రి 9 గంటలకు దుకాణం నుంచి ఇంటికి వచ్చాడు. ౖసైనెడ్‌ కలిపిన బిర్యానీ తీసుకొచ్చాడు. ఆ విషయం భార్యాపిల్లలకు తెలీదు. కుటుంబమంతా బిర్యానీ తిన్నారు. అంతలో చిన్న కూతురు కుసుమ వాంతి చేసుకుంది. కొద్ది క్షణాల్లోనే మిగతావారంతా నేలకొరిగారు. ఈ విషయం గమనించిన కుసుమ పక్కింటికి వెళ్లి అమ్మ, నాన్న నిద్రపోయి లేవలేదు అని ఏడుస్తూ చెప్పింది. వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. వాంతులు చేసుకున్న చిన్నారిని హుటాహుటిన స్థానిక ఎన్‌టీఆర్‌ ఆస్పత్రికి తరలించి వైద్యం అందించారు. అనంతరం కేజీహెచ్‌కు తరలించారు.

మూడేళ్లుగా దూరం
రామకృష్ణ అప్పులు చేసి ఎవరికీ తెలియకుండా అనకాపల్లి టౌన్‌లో నివసిస్తున్నట్టు అనకాపల్లి చేరుకున్న అతని సోదరుడు వెంకటేశ్వరరావు చెప్పిన వివరాల ప్రకారం తెలుస్తోంది. సుమారుగా మూడేళ్లుగా కుటుంబ సభ్యులతో సఖ్యత లేదని తెలుస్తోంది. మృతదేహాలను చూసేందుకు ఒక సోదరుడు మినహా కుటుంబ సభ్యులు ఎవరూ రాలేదు.

ఆధారాలు లేవు
ఘటన స్థలంలో ఆత్మహత్యకు సంబంధించిన ఎటువంటి ఆధారాలూ లభించలేదని డీఎస్పీ వి.సుబ్బరాజు చెప్పారు. క్లూస్‌టీమ్‌ ఇంటిలో అన్ని గదులనూ క్షణంగా పరిశీలించిందని పేర్కొన్నారు. బిర్యానీ ప్యాకెట్లతో భోజనం చేస్తూ అక్కడిక్కడే నలుగురు మృతి చెందగా, కుసుమప్రియ అపాయం నుంచి తప్పించుకుందని, ప్రస్తుతం కేజీహెచ్‌లో కోలుకుంటోందన్నారు. శివరామకృష్ణ అన్నయ్య వెంకటేశ్వరరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ దాడి మోహనరావు చెప్పారు.

Advertisement
 
Advertisement
 
Advertisement