తిరుమల లడ్డూపై అసత్య ప్రచారం సిగ్గుచేటు | - | Sakshi
Sakshi News home page

తిరుమల లడ్డూపై అసత్య ప్రచారం సిగ్గుచేటు

Feb 9 2026 7:45 AM | Updated on Feb 9 2026 7:45 AM

తిరుమల లడ్డూపై అసత్య ప్రచారం సిగ్గుచేటు

తిరుమల లడ్డూపై అసత్య ప్రచారం సిగ్గుచేటు

టీడీపీ నేతల తీరుతో దెబ్బతిన్న హిందువుల మనోభావాలు ప్రజల దృష్టిని మళ్లించేందుకు వైఎస్సార్‌సీపీ శ్రేణులపై దాడులు నిజాలు తెలుసుకున్న ప్రజలే కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పడం ఖాయం మాజీ మంత్రి మేకతోటి సుచరిత, వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్తలు అంబటి మురళీకృష్ణ, వనమా బాల వజ్రబాబు

పట్నంబజారు: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వరస్వామి లడ్డూ ప్రసాదంపై రాజకీయాలు చేయటం సిగ్గుచేటని హోం శాఖ మాజీ మంత్రి మేకతోటి సుచరిత ధ్వజమెత్తారు. బృందావన్‌ గార్డెన్స్‌లోని పార్టీ జిల్లా కార్యాలయంలో ఆదివారం విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. వైఎస్సార్‌ సీపీపై బురద జల్లేందుకే మరీ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. వైఎస్సార్‌ సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసిందని అసత్యాలు ప్రచారం చేశారని దుయ్యబట్టారు. లడ్డూలో కొవ్వు కలిసి ఉంటే తాము సుప్రీంకోర్టు తలుపుతట్టే వాళ్లమే కాదని స్పష్టం చేశారు. అయోధ్యకు పంపిన లడ్డూలో కూడా జంతు కొవ్వు కలిసిందని టీడీపీ చెప్పటం దారుణమన్నారు. పవన్‌కళ్యాణ్‌ ఒక్క మాటపై నిలబడే పరిస్థితి లేదని విమర్శించారు. సీబీఐ నివేదిక ఇచ్చిన తరువాత కూడా, తాజాగా ఫినాయిల్‌ వంటి రసాయనాలు కలిశాయని కొత్త పాట మొదలు పెట్టడం దారుణం అన్నారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు కుటుంబాన్ని పరామర్శించేందుకు పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గుంటూరుకు వస్తే నగరం జనసంద్రం అయిందన్నారు. చంద్రబాబు దేవుడిని క్షమాపణ కోరాలని డిమాండ్‌ చేశారు.

చంద్రబాబు సర్కారు కూలడం ఖాయం

పొన్నూరు నియోజకవర్గ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ మాట్లాడుతూ చంద్రబాబు సర్కార్‌ రాష్ట్రంలో ప్రజా విశ్వాసం కోల్పోయిందని పేర్కొన్నారు. రాష్ట్రంలో సర్కారీ ఆర్గనైజ్‌డ్‌ క్రైమ్‌ జరుగుతోందని మండిపడ్డారు. దానిలో భాగంగా మాజీ మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేష్‌ నివాసాలపై దాడులు చేశారని ధ్వజమెత్తారు. మాజీ మంత్రుల నివాసాలను తగులబెడుతున్న చంద్రబాబు ప్రభుత్వాన్ని ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ప్రజలే తగులబెట్టేస్తారని స్పష్టం చేశారు. మాజీ మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేష్‌, కాకాని గోవర్ధన్‌రెడ్డి లపై అక్రమ కేసులు పెట్టి ప్రజలను భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. తిరుపతి లడ్డూ ప్రసాదం విషయంలో ప్రజలకు స్పష్టత ఇవ్వాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. లడ్డూలో ఎలాంటి జంతువుల కొవ్వు కలవలేదని సీబీఐ తేల్చి చెప్పిందన్నారు. చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌లు లడ్డూ విషయంలో అసత్య ప్రచారం చేశారని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉన్న ల్యాబ్‌ ఎలాంటి జంతువుల కొవ్వు కలవలేదని రిపోర్ట్‌ ఇచ్చిందని తెలిపారు. వైఎస్‌ జగన్‌కు హిందువుల ఓట్లు దూరం చేయాలనే కుట్ర జరిగిందన్నారు. లడ్డూ ప్రసాదంలో ఎలాంటి జంతువుల కొవ్వు కలవలేదని సుప్రీంకోర్టు స్పష్టం చేయటంతో వైఎస్సార్‌ సీపీ పాప ప్రక్షాళన దీక్ష చేపట్టిందన్నారు. రానున్న ఎన్నికల్లో ప్రజల ఆగ్రహంతో చంద్రబాబు ప్రభుత్వం కాలి బూడిద కావడం తథ్యమన్నారు. చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌లు ప్రజలకు, వెంకటేశ్వర స్వామికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు.

హిందువుల మనోభావాలతో చెలగాటం

తాడికొండ నియోజకవర్గ సమన్వయకర్త వనమా బాలవజ్రబాబు మాట్లాడుతూ సీఎం చంద్రబాబు హిందువుల మనోభావాలను దెబ్బతీశారని మండిపడ్డారు. ఆధారాలతోనే సీఎం స్థానంలో ఉన్న వారు మాట్లాడాలన్నారు. కూటమిలో ఒక ఎమ్మెల్యేగా పవన్‌ కళ్యాణ్‌ పని చేస్తున్నారని, తనకు ఒక పార్టీ ఉందనే విషయాన్ని మర్చిపోయారన్నారు. సుప్రీంకోర్టులో చార్జిషీటు దాఖలు అయిన తరువాత కూడా టీడీపీ నేతలు ఇలా విషం చిమ్మటం సిగ్గుచేటన్నారు. ఆధారాలు అంటే బయటపెట్టాలని సవాల్‌ విసిరారు. పక్కా ప్రణాళిక ప్రకారమే దాడులు చేశారన్నారు. కూటమికి ఆ దేవుడే ముగింపు పలుకుతాడని హెచ్చరించారు. ఈ సమావేశంలో వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర కార్యదర్శులు నిమ్మకాయల రాజనారాయణ, షేక్‌ గులాం రసూల్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement